అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనపైనే అందరి దృష్టి

ఇప్పుడు దేశ విదేశాల్లో అయోధ్య రామందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. కోట్లాది మంది భారతీయుల కల ఈ నెల 22న నెరవేరబోతోంది. ఆరోజు అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతోంది. 2019 నవంబర్‌లో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీమ్‌ కోర్టు అనుమతించింది. అప్పటి నుంచి రామాలయ నిర్మాణం మొదలైంది.
 
ఇందుకు రూ.3,500 కోట్ల విరాళాలు దాదాపు 12.5 కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా అందించారు.  రామ్‌లల్లా విగ్రహం 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. బరువు సుమారు 1.5 టన్నుల బరువు ఉంటుంది. కాగా, ఈ విశేష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ, విదేశాల్లో భక్తులు వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
మూడు అంతస్తుల ఎత్తులో ఉండే రామాలయం ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం 302 పిల్లర్లతో 44 ప్రవేశద్వారాలను కలిగిఉంటుంది. గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. అలాగే, శ్రీరాముడి దర్బారు మొదటి అంతస్తులో ఉంటుంది. మొత్తం అయిదు మండపాలు రామాలయంలో ఉంటాయి. 
 
రంగ మండపం, సభా మండపం, కీర్తన మండపం, నృత్య మండపం, ప్రార్ధనా మండపాలు ఇందులో ఉంటాయి. ఆలయం చుట్టూ 732 మీటర్ల ప్రహరీ ఉంటుంది. దీని వెడల్పు 14 మీటర్లు. కాగా, ఆలయ కాంప్లెక్స్‌ నలుమూలల మరో నాలుగు ప్రార్ధనా మందిరాలు ఉంటాయి. సూర్యదేవుడు, దేవీ భగవతి, గణేశుడు, శివుని ఆలయాలు నిర్మించారు.
 
ఉత్తరం వైపు అన్నపూర్ణాదేవీ ఆలయం, దక్షిణాన ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు. ప్రధాన మందరానికి సమీపంలో సీతాకూపం పేరుతో ఉన్న పురాతన బావిని పునరుద్ధరించారు. అదేవిధంగా, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ట, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, తదితర చిన్న ఆలయాలు కూడా కాంప్లెక్స్‌లో నిర్మించారు. 
 
దక్షిణ భాగంలో పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు. ఇందులోనే జటాయువు ప్రతిమ కూడా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి స్టీల్‌ను వాడలేదు. వెయ్యేళ్లు సురక్షితంగా ఉండేలా డిజైన్‌ చేశారు. ఆలయం మొత్తం 4.7 లక్షల క్యూబిక్‌ అడుగుల పింక్‌ శాండ్‌స్టోన్‌ను వాడారు. రాజస్తాన్‌లోన భరత్‌పుర ప్రాంతం నుంచి ఈ స్టోన్‌ తరలించారు. మొత్తం 161 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉండే ఈ చారిత్రక ఆలయం పునాది నుంచి ఎటువంటి తేమ రాకుండా గ్రానైట్‌ రాయి 21 అడుగుల మందంతో పరిచారు.
 
హైదరాబాద్ లోనే తలుపుల తయారీ
 
ఈ ఆలయ నిర్మాణంలో తెలుగువారి కీర్తి ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతోంది. మొత్తం ఆలయ ద్వారాలు, తలుపులను నిర్మించే బాధ్యత తెలంగాణ దక్కించుకోవడం విశేషం. అయోధ్య రామమందిరం గర్భగుడితో సహా ఆలయంలో అమర్చే అతి భారీ తలుపులను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు.
గర్భగుడికి అమర్చే 18 తలుపులు (బంగారు తాపడం) ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి.
కొన్నింటిని బిగించారు కూడా. హైదరాబాద్‌లోని అనూరాధ టింబర కంపెనీ ఈ తలుపుల తయారీ బాధ్యతను తీసుకుంది. మొత్తం 118 తలుపులను తయారు చేశారు. వీటిలో ఇప్పటికే 100 పూర్తయ్యాయి.  మిళనాడు నుంచి వచ్చి కళాకారులు ఈ తలుపులను రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని మూడవ శతాబ్దంలోని గుప్తులు అనుసరించిన  నగర శైలిలో రూపొందిస్తున్నారు.  ఒక్కో తలుపు 8 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, ఆరంగుళాల మందంతో చెక్కారు.
 
ఇవి కనీసం వెయ్యేళ్లపాటు చెక్కుచెదరదు. ప్రతి తలుపై కలువపూలు, నెమళ్లు, ఇతర పక్షులు, అందమైన లతలు వంటివి చెక్కేరు. ఈ తలుపుల తయారీకి ఉపయోగించిన టేకు కల మహారాష్ట్రలోని బల్లార్ష నుంచి సేకరించారు. ఇక దేశవ్యాప్తంగా ఇంటింటింకి రామయ్య అక్షతలు చేరుతున్నాయి. ఇంటికొచ్చి అక్షతలు ఇస్తున్నవారికి భక్తులు హారతులు పడుతున్నారు.  ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా అతిథులకు రామజన్మభూమిలోని గర్భగుడివద్ద తీసిన మట్టిని కానుకగా ఇవ్వబోతున్నారు.
 
55 దేశాల నుంచి 100 మంది ప్ర‌ముఖుల‌ హాజ‌రు
 
శ్రీరాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి 55 దేశాల నుంచి రాయ‌బారులు, ఎంపీలు స‌హా దాదాపు 100 మంది హాజ‌రు కానున్నారు. 
ప్రభు శ్రీరామ్ వంశజ్ అని చెప్పుకునే కొరియన్ రాణిని కూడా ఆహ్వానించామ‌ని ప్ర‌పంచ హిందూ ఫౌండేష‌న్ గ్లోబ‌ల్ చైర్మ‌న్ స్వామి విజ్ఞానానంద తెలిపారు.

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలార‌స్‌, బొత్స్వానా, కెన‌డా, కొలంబియా, డెన్మార్క్‌, డొమ్నిక్‌, కాంగో, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఫిజీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, ఘ‌నా, గుయానా, హాంకాంగ్‌, హంగ‌రీ, ఇట‌లీ, ఇండోనేషియా, బ్రిట‌న్‌, అమెరికా, న్యూజిల్యాండ్‌, సింగ‌పూర్ స‌హా ప‌లు దేశాల నుంచి అతిధుల‌కు ఆహ్వానాలు అందించామ‌ని చెప్పారు.

ప‌లు దేశాధినేత‌లు సైతం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నార‌ని స్వామి విజ్ఞానానంద వెల్ల‌డించారు. వీవీఐపీ విదేశీ ప్ర‌తినిధులు జ‌న‌వ‌రి 20న ల‌క్నో వ‌స్తార‌ని ఆపై జ‌న‌వ‌రి 21 సాయంత్రానికి అయోధ్య చేరుకుంటార‌ని ఆయ‌న తెలిపారు.