కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవరా కాంగ్రెస్ కు రాజీనామా

కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవరా కాంగ్రెస్ కు రాజీనామా
రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రారంభం రోజు కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్రలో పార్టీ సీనియర్‌ నేత మిలింద్‌ దేవరా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి,  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివ‌సేన‌లో చేరారు. దేవ‌రాకు షిండే కాషాయ జెండాను అంద‌చేశారు.

తాను కాంగ్రెస్‌ను వీడ‌తాన‌ని ఎన్న‌డూ అనుకోలేద‌ని, ఆ పార్టీతో త‌మ కుటుంబానికి ఉన్న 55 ఏండ్ల అనుబంధం నేటితో తెగిపోయింద‌ని అంటూ మిలింద్ దేవ‌రా భావోద్వేగానికి లోన‌య్యారు. ఏక్‌నాథ్ షిండే నాయ‌కత్వంలో తాను శివ‌సేన గూటికి చేరుతున్నాన‌ని చెప్పారు.

తన రాజకీయ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని నేడు ప్రారంభిస్తున్నాను. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు.  షిండే అంద‌రికీ అందుబాటులో ఉండే నేత‌ని, దేశానికి మోదీ, అమిత్ షా దార్శ‌నిక‌త ఎంతో అవ‌స‌ర‌మ‌ని, అందుకే తాను వారితో క‌లిసి ప‌నిచేయాల‌ని కోరుకున్నాన‌ని తెలిపారు. 
 
కాగా, మిలింద్ దేవ‌రా త‌మ పార్టీలో చేరితే స్వాగ‌తిస్తాన‌ని అంత‌కుముందు మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. కాంగ్రెస్‌, ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన మ‌ధ్య లోక్‌స‌భ సీట్ల స‌ర్ధుబాటు చ‌ర్చ‌ల ప‌ట్ల అసంతృప్తితో మిలింద్ దేవ‌రా కాంగ్రెస్‌ను వీడార‌ని చెబుతున్నారు.

2014 వరకు ఆయన ప్రాతిథ్యం వహించిన ముంబై దక్షిణ పార్లమెంట్‌ సీటులో తాము రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఇప్పటికే ప్రకటించింది. దీంతో పొత్తులో భాగంగా తనకు పోటీచేసే అవకాశం లభించదని భావించిన దేవరా. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ దివంగత నేత మురలీ దేవరా కుమారుడు మిలింద్‌ దేవరా. ఆయన లోక్‌సభకు తొలిసారిగా 2004లో ముంబై సౌత్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011లో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టారు. 2012లో అదనంగా షిప్పింగ్‌ శాఖను అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అప్పగించారు.