సంక్రాంతి వేడుకల్లో పంచెకట్టులో పీఎం మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన, పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ దక్షిణ భారతానికి చెందిన సంప్రదాయ పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియోలో మోదీ నల్లకోటుతో, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నారు.  ఎడమ భుజంపై శాలువా వేసుకున్నారు. 
 
ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ప్రధాని దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో సుఖశాంతులు తీసుకువస్తుందని ఆకాంక్షించారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక యువ గాయని పాట పాడుతూ ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ వద్దకు వచ్చి తన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. ఆ క్రమంలోనే తన పాటతో పరవశించి పోయిన ప్రధాని మోదీ ఆ చిన్నారిని ఆశీర్వదించి త‌న శాలువ‌ను బహూకరించారు. 
 
ఆ క్రమంలో చిన్నారికి సన్మానం చేసి అందించారు. దీంతో చిన్నారి సంతోషంతో ధన్యావాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని  మోదీ ప్రసంగిస్తూ ఒకే భారతదేశం, ఉత్తమ భారతదేశం అనే స్ఫూర్తిని పొంగల్ పండుగ ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ ఐక్యతా స్ఫూర్తి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశానికి’ బలాన్ని ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
అలాగే పండుగలన్నీ ఏదో ఒక రకంగా వ్యవసాయానికి సంబంధించినవేనని చెప్పారు. 3 కోట్ల మంది రైతులు శ్రీఆన్‌తో అనుబంధం కలిగి ఉన్నారని, దేశంలోని చాలా మంది యువత శ్రీఆన్‌తో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని ప్రధాని తెలిపారు. మిల్లెట్లు తమిళ సంస్కృతితో ముడిపడి ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు.