అలవోకగా ఆఫ్ఘన్ పై సిరీస్ గెలిచిన భారత్

అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో (26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  మూడు టీ20ల సిరీస్‍లో 2-0తో ఆధిక్యం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సునాయనంగా సిరీస్ గెల్చింనట్లయింది.

యశస్వి జైస్వాల్‌(34 బంతుల్లో 68, 5ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్‌ దూబే(32 బంతుల్లో 63 నాటౌట్‌, 5ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో విజృంభించారు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ(0) వరుసగా రెండో మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరువకుండానే సున్నాకు వెనుదిరిగాడు.  మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.  గులాబ్దిన్‌ నయీబ్‌(57) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, సహచర బ్యాటర్లు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. 

ప్రత్యర్థి తన బౌలింగ్‌తో కట్టడి చేసిన అక్షర్‌ పటేల్‌(2/17)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మూడో మ్యాచ్‌ ఈ నెల 17న బెంగళూరులో జరుగనుంది. బ్యాటింగ్‌ ప్యారడైజ్‌గా పేరు గాంచిన ఇండోర్‌లో యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీనియర్లు ఆకట్టుకోలేని చోట అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అఫ్గన్‌ బౌలర్లను ఊచకోత కోశారు. 

యశస్వి జైస్వాల్, శివమ్ దూబే అర్ధ శతకాలతో అదరగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్‍లో అజేయ హాఫ్ సెంచరీ చేసి సత్తాచాటాడు దూబే. భారత్ జట్టు తరఫున సుమారు 14 నెలల తర్వాత టీ20లో బరిలోకి దిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చూడచక్కని షాట్లు ఆడాడు. 16 బంతుల్లోనే 29 పరుగులతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయి వరుసగా రెండో మ్యాచ్‍లో నిరాశపరిచాడు.
యశస్వి, శివమ్ దూబే బౌండరీలు, సిక్సర్లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 100 పరుగులు దాటేసింది. ఈ క్రమంలో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి. అయితే, 13వ ఓవర్లో అతడు ఔటయ్యాడు. దూబే మాత్రం దంచుడు కొనసాగించాడు. నబీ వేసిన ఓకే ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దూబే 22 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. చివరి వరకు అజేయంగా నిలిచి భారత్‍ను గెలుపు తీరాన్ని దాటించాడు.