ప్రారంభానికి సిద్ధమైన సముద్రంపై అతిపెద్ద బ్రిడ్జి

దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై- నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితమివ్వనున్నారు. రూ.18 వేల కోట్లతో నిర్మించిన ఈ 22 కిలోమీటర్ల ఈ సముద్రపు వంతెనకు ‘అటల్ సేతు’ అని నామకరణం చేశారు. అయితే దీనిపై ప్రయాణించడాన్ని ఆటోలు, మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లకు అధికారులు నిషేధించారు. అదేవిధంగా జంతువులను రవాణా చేసే వాహనాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు.
 
ఇక ఈ బ్రిడ్జిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వెగంతో వాహనాలు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు.  అటల్‌ సేతు ప్రారంభమైతే ముంబై నుంచి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరమవుతుంది. పాత కొత్త నగరాల మధ్య 20 నుంచి 25 నిమిషాల్లోనే రాకపోకలు సాగించవచ్చు. ఇది దక్షిణ ముంబైలోని శివడి నుంచి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది.
 
 మొత్తం 22 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి సముద్రంపై 16.5 కిలోమీటర్లు, భూభాగంపై 5.5 కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఇది ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్‌ వేను, ముంబై- గోవా హైవేలను కలుపుతుంది. దీనిపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. దేశంలోనే అత్యంత పొడవైన ఈ సముద్రపు వంతెనపై ఒకవైపు ప్రయాణించాలంటే రూ.250 చెల్లించాల్సిందే.