
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్రమైన సమస్యలు మూడేళ్ల క్రితమే బయటపడినట్లు వెలుగులోకొచ్చింది. అయితే గత పాలకులు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ మూడు బ్యారేజీల్లో నీటి నిల్వ సామర్థ్యం, గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందకు విడుదల సమయంలో నీటి వేగాన్ని తట్టుకునే విధంగా రక్షణ గోడ సామర్థ్యం తక్కువగా ఉండటం వంటి సమస్యలు బయటపడ్డాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ వంటి సంస్థలతో అధ్యయనాలు చేయించి తగు చర్యలు తీసుకోవాలని 2020 జనవరి 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ కి లేఖ రాశారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదన్న విషయం వెలుగులోకొచ్చింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత, సమస్య తీవ్రత పెరిగాక తాజాగా ఆ సంస్థతో అధ్యయనం చేయించడానికి లేఖ రాసినట్లు తెలిసింది.
గేట్ల నిర్వహణలో లోపం, బ్యారేజీ సమీపంలో గేట్ల ఎగువన ఇసుక మేట వేయడం, పర్యవసానంగా ఎక్కువ కేంద్రీకృత వేగంతో నీటి ప్రవాహం, గేట్ల నుంచి నీటి విడుదల సమయంలో ప్రవాహ వేగం నిలకడగా లేకపోవడం వల్ల రక్షణ వ్యవస్థ దెబ్బతినడం తదితర అంశాలపై సీడీవో వివరంగా పేర్కొన్నారు. అయితే సమస్య డిజైన్ కు సంబంధించి కాదని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాక నీరు కిందకు దూకే వేగాన్ని షూటింగ్ వెలాసిటీ అంటారు. ఇది సరాసరి 4 నుంచి 5 మీటర్లు ఉండాలి. కానీ.. కాళేశ్వరం బ్యారేజీల్లో మాత్రం ఏకంగా 16 నుంచి 18 మీటర్ల వరకు ఉంది. దీంతో దిగువకు విడుదలయ్యే సమయంలో నీటి వేగానికి బ్యారేజీల దిగువన ఉన్న రక్షణ దిమ్మెలు కొట్టుకుపోయాయి.
అసలే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన ప్రాంతంలో నీటి లభ్యత అధికంగా ఉంటుంది. అందుకే అక్కడ నిర్మించారు. దీంతో షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉంటుంది. కానీ దాన్ని అంచనా వేయకుండా.. నిర్మాణం చేపట్టడంతో బ్యారేజీ దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు చెల్లాచెదురైపోయాయి. ఇటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి కూడా ఇంతే. నిర్మాణ లోపాలు బయటపడినప్పుడే సరిదిద్దుకుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో వచ్చే వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితీరు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి.
More Stories
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం