ఎవరు వద్దన్నా.. ఎవరు కాదన్నా మోదీ మూడోసారి ప్రధాని

ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లక్షమంది అసదుద్దీన్ లు, ప‌ది లక్షల కేసీఆర్ లు, కోటి మంది రాహుల్ గాంధీలు వచ్చినా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కావడాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ లో మాట్లాడుతూ  తాను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా జేజేలు పలికిందని పేర్కొన్నారు.

బానిస మనస్తత్వం నుంచి బయటపడేలా ప్రధాని మోదీ 15 వందల చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చారని తెలిపారు. అంతేకాకుండా, కలలో కూడా ఊహించని విధంగా మన కళ్ల ముందు అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయ్యిందని, బాబర్ కూల్చిన రామాలయాన్ని రక్తం చిందించకుండా మోదీ మళ్లీ నిర్మించారని ఆయన కొనియాడారు.

ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి మనదేశంలో ఉందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని అనేక బహుళజాతి కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని పేర్కొంటూ ఏ దేశం అభివృద్ధి చెందాలన్న యువతదే కీలకపాత్ర అని ఆయన తెలిపారు.  2047లోపు భారత్ అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని కిషన్‌ రెడ్డి సూచించారు.

బుజ్జగింపు రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చామని, వంశపారంపర్య రాజకీయాలకు ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబ పార్టీలు దోపిడీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆనాడు మోదీకి వీసా ఇవ్వని అమెరికా నేడు అదే వైట్ హౌస్ లో ప్రధాని మోదీని సత్కరించారని గుర్తు చేశారు. ఎన్నికల కోసం కాద‌ని, దేశాభివృద్ధి కోసం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపిచ్చారు.