కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ కు కరోనా

కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ కు కరోనా

కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రాజ్ భవన్ లో క్వారంటైన్ లో ఉంన్నారని తెలిపింది.

‘‘కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన రాజ్ భవన్ లోనే క్వారంటైన్లో ఉన్నారు. తదుపరి సమాచారం వచ్చే వరకు గవర్నర్ పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేస్తున్నాం’’ అని గవర్నర్ కార్యాలయం తెలిపింది.

దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ జేఎన్ 1‌ కారణమని, రాబోయే రోజుల్లో ఇది ప్రబలంగా మారుతుందని సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) డేటా సూచిస్తోంది. తూర్పు ప్రాంతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మాత్రమే వేరియంట్‌ కేసులు నమోదైనట్టు వెల్లడించాయి.

దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఇది తన ఉనికిని ఏర్పరచుకుంది. దీని ప్రాబల్యం దక్షిణాదిలో అత్యధికంగా ఉందని, తరువాత ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ చివరి వారంలో ఇన్‌సాకాగ్ ల్యాబ్‌లలో పరీక్షించిన కరోనా-పాజిటివ్ శాంపిల్స్‌లో తూర్పు ప్రాంతంలో కేవలం 28.6% మాత్రమే జేఎన్.1 వేరియంట్‌కు చెందినవి ఉండగా, దక్షిణాదిలో 100% ఉన్నాయి. 

దేశంలో జేఎన్.1 రకం వేరియంట్‌ను డిసెంబరు 17న కేరళలో మొదటిసారి గుర్తించారు. తిరువనంతపురం జిల్లాలో 79 ఏళ్ల మహిళ జలుబు, జ్వరం వంటి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా కొత్త వేరియంట్ బయటపడింది.

ఇలా ఉండగా, దేశంలో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,50,19,872కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,643 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇద్దరు, కేరళలో ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,33,406కి చేరింది.