
* వికాస్ పథక్
కేంద్ర మాజీ మంత్రి, రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యమైన పాత్రధారులలో ఒకరుగా, బిజెపి ప్రముఖ నాయకురాలుగా పేరొంది కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమాభారతి బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో డిసెంబర్ 6, 1992న అయోధ్యలో ఉన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారుగా సిబిఐ పేర్కొన్న 32 మంది నిందితులలో ఆమె ఒకరు. వీరందరినీ 2020లో ప్రత్యేక సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
వారిని నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీల్ ను గత ఏడాది అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో జరిపిన సంభాషణలో, ఉమా భారతి జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు అయోధ్యకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందు రామాలయ ఉద్యమం గురించి చర్చించారు.
* రామజన్మభూమి ఉద్యమంతో మీకు ఎలా అనుబంధం ఏర్పడింది?
నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు మతపరమైన ప్రసంగాలు చేసేందుకు అయోధ్యకు వెళ్లాను. నేను చిన్నప్పుడు రామాయణం, మహాభారతం గురించి ఉపన్యాసాలు ఇచ్చేదానిని. మహంత్ రామ్ చంద్ర దాస్ నా చిన్నతనంలో ప్రసంగించేందుకు నన్ను అక్కడికి తీసుకెళ్లారు.
నేను అక్కడ ఒక తాళం చూశాను. లోపల ప్రార్థనలు జరుగుతూ ఉండటం కూడా చూశాను. అక్కడ తాళం ఎందుకు ఉంది? అని అడిగాను. చాలా కాలం క్రితం గుడిని కూల్చివేశారని చెప్పారు. ఇప్పుడు, కోర్టు ఆదేశాలతో, అక్కడ తాళం ఉంది కానీ ప్రార్థనలు కూడా బయటనే అనుమతించేవారని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ జ్ఞాపకం నాలో నిలిచిపోయింది.
1984లో, వి హెచ్ పి -సంబంధిత ఆందోళన – జోర్ సే బోలో, రామ్ జన్మభూమి కా తాలా ఖోలో (మాట్లాడండి, రామజన్మభూమిని అన్‌లాక్ చేయండి) – అక్కడ ప్రారంభమైంది. అప్పటికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆందోళనలో పాల్గొనమని నన్ను కోరారు. నేను చేరాను.
*1980ల చివరలో ఉద్యమం ఊపందుకున్నప్పుడు దాని గురించి మీ జ్ఞాపకాలు ఏమిటి?
తాళాలు తెరిచినప్పుడు, నేను 1989 సెప్టెంబరులో శిలాన్యాస్ (శంకుస్థాపన)లో పాల్గొన్నాను. అప్పుడు మధురలో ఒక సమావేశం జరిగింది. కరసేవ (ఆలయానికి స్వచ్ఛంద సేవ) తేదీని అక్టోబర్ 31, 1990 అని ప్రకటించారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా విపి సింగ్ జీ గందరగోళానికి గురయ్యారు, కొన్నిసార్లు మాతో, కొన్నిసార్లు కమ్యూనిస్టులతో ఏకీభవించారు.
కమ్యూనిస్టులు మాలాగే బయటి నుండి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ‘పరిందా పర్ భీ నహిన్ మార్ పాయేగా (అయోధ్యలో పక్షి కూడా ఎగరదు)’ అని ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. నేను కరసేవ కోసం రాజమాత విజయరాజే సింధియాతో వెళ్ళాను. కానీ ఆమెను నిర్బంధించి చినార్ జైలుకు పంపారు. నన్ను బందా అతిథి గృహంలో ఉంచారు.
అక్టోబర్ 31న కరసేవ జరిగింది. పోలీసుల దాడిలో అశోక్ సింఘాల్ జీ గాయపడ్డారు. దూరదర్శన్‌లో ఈ వార్త చూశాం. కరసేవలో చేరాలని ప్రజలను కోరుతూ మేము వారి చుట్టూ తిరిగి, వారిప్పుడు బుల్లెట్లను ఎదుర్కొంటుంటే, నేను గెస్ట్ హౌస్‌లో విఐపి లాగా కూర్చున్నానని అంటూ ఆందోళన చెందాను.
నేను అవమానంతో కొంతమందితో త్వరితగతిన ప్లాన్ చేసి, కర్ఫ్యూలో ఉన్నప్పుడు అయోధ్యకు బయలుదేరాను. నేను అయోధ్యకు చేరుకున్నాను. నవంబర్ 2 కరసేవ జట్టుకు నాయకత్వం వహించమని నన్ను అడిగారు. మా జట్టలో కొందరు పొరపాటున దూరంగా వెళ్లిపోయారు. వారిలో ఇద్దరు రామ్‌కుమార్, సోహిత్ కుమార్ కొఠారి పోలీసుల చేతిలో హతమయ్యారు.
కర్ఫ్యూ పరిస్థితుల్లో హనుమాన్‌గర్హి వైపు షార్ట్‌కట్ తీసుకున్న వారిని కాల్చి చంపారు. నేను నాయకత్వం వహిస్తున్న సమూహంపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించారు. సిఆర్పిఎఫ్ మహిళలు నన్ను భౌతికంగా ఎత్తుకెళ్ళి ఫైజాబాద్ జైల్లో పడేశారు. మరుసటి రోజు స్థానిక మహిళలు జైలును చుట్టుముట్టారు. ఆ తర్వాత నన్ను నైనీ జైలుకు తరలించారు. ఉద్యమం కొనసాగింది. అశోక్ సింఘాల్ దానిని ఆపవద్దని పట్టుబట్టారు. డిసెంబర్ 6, 1992న కరసేవ ప్రకటించారు.
*డిసెంబర్ 6న మీ జ్ఞాపకాలు ఏమిటి?
డిసెంబర్ 5న ఎంతో పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వీరంతా మా సహచర కార్యకర్తలు కాదని నా సీనియర్‌తో నేను ఆందోళన వ్యక్తం చేశాను. చాలామంది రామభక్తులు.వారు మన నియంత్రణలో ఉండకపోవచ్చు. అయితే చింతించకని అని నాతో చెప్పారు. డిసెంబరు 6వ తేదీ ఉదయం, ఆచార్య ధర్మేంద్ర, రితంభరా జీ, నన్ను జనం పోడియం వద్దకు వెళ్లమని కోరారు.
రామజన్మభూమికి అర కిలోమీటరు దూరంలో ఒక భవనం ఉంది. అక్కడ నుండి స్పాట్ కనిపించింది. పోడియం ఆ భవనం పైన ఉండేది. (మురళీ మనోహర్) జోషి జీ, (ఎల్‌కే) అద్వానీ జీ, రాజమాత విజయరాజే సింధియా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని కోరారు.
యాదృచ్ఛికంగా, నేను మాట్లాడుతున్నప్పుడు, కరసేవకులు నిర్మాణంపైకి ఎక్కడం చూశాను. నేను ప్రసంగం ఆపేసాను. నేను నిలబడి ఉండడంతో వారిని చూడగలిగాను. మరికొందరు నించోలేక కూర్చున్నారు. కరసేవకులు నిర్మాణంపైకి ఎక్కారని నేను ఇతరులకు చెప్పాను. కిందికి రావాల్సిందిగా అద్వానీ మైక్రోఫోన్‌లో వారికి విజ్ఞప్తి చేశారు. కానీ, ‘జై శ్రీరామ్’ అన్న కేకలు ఎవరూ వినలేదు.
ప్రజలు నా మాట వింటారని అద్వానీ గారు నన్ను భవనం వెనుక మార్గం నుండి అక్కడికి వెళ్లమని చెప్పారు. అక్కడ నియమించిన అదనపు ఎస్పీ అంజు గుప్తా, తన స్వంత సహాయకుడు దీపక్ చోప్రా, ప్రమోద్ మహాజన్‌లను కూడా నాతో పాటు వెళ్ళమని చెప్పారు. మేము కారులో వెళ్ళాము. ప్రజలు మమ్మల్ని చుట్టుముట్టారు. రామజన్మభూమికి ఎందుకు వెళ్తున్నావని అరిచారు.
రెండేళ్ల క్రితం పోలీసుల కాల్పుల్లో మరణించిన కొఠారి సోదరుల తల్లి కూడా నన్ను అడ్డగించింది. ఈ నిర్మాణం తన కుమారులను చంపిందని, తప్పక కూలిపోవలసిందే అని ఆమె స్పష్టం చేశారు. క్రమశిక్షణ అవసరమని నేను వేడుకున్నాను. బాబ్రీ నిర్మాణాన్ని కూల్చివేయాల్సిందేనని ఆమె ఎదురు తిరిగారు.
కరసేవకులు నన్ను భౌతికంగా ఎత్తుకుని పోడియం వద్ద వదిలేశారు.
కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంను రద్దు చేశారని, పారామిలటరీ బలగాలు పెద్ద సంఖ్యలో గుమిగూడాయని మేము కొద్దిసేపటికి విన్నాము. నేను అక్కడే ఉండిపోయాను. బాబ్రీ మసీదు కూలిపోయింది. తనను అక్కడికి తీసుకెళ్లమని రాజమాత చెప్పింది. అక్కడ శిథిలాల కుప్పలు మాత్రమే ఉన్నాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ బూట్లు విప్పి రామ్ లల్లాకు ప్రమాణం చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను. రాజమాత, నేను మా తలలను నేలకు తాకాము.
* ఉద్యమంలో ఎవరు ఎక్కువ క్రియాశీలంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు?
ఆ రోజు నిర్మాణాన్ని కూల్చివేసిన కరసేవకులకే తొలి ఘనత. దానితోనే భారత పురావస్తు శాఖ ఆ స్థలాన్ని తవ్వి తీయగలిగింది. దానితోనే వారు కింద పాత ఆలయ నిర్మాణాల అవశేషాలను కనుగొన్నారు. సుప్రీం కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకుంది. నిర్మాణాన్ని కూల్చడానికి కరసేవకులు బాధ్యులు. కానీ మమ్ములను — అద్వానీ జీ, నేను, ఇతరులను — 2017లో చార్జిషీట్ లో నిందితులుగా పేర్కొని నేరస్థులుగా మార్చారు.
కానీ నేను అస్సలు చింతించలేదు. కరసేవకులపై కాల్పులు జరిపితే వారిని కాపాడుతూ ఆ రోజే నేను చనిపోవాలనుకున్నాను. ఎట్టకేలకు ప్రధానమంత్రి హోదాలో మోదీజీ అయోధ్యలో జరిగిన శిలాన్యాసానికి హాజరైనప్పుడు, హిందూ- ముస్లింల మధ్య విభేదాలు తలెత్తకుండా ఆయన చేసిన తీరు మనల్ని ప్రపంచంలోనే తల ఎత్తుకొనేటట్లు చేసింది.
ప్రపంచం భారతదేశాన్ని కుల, మత వివాదాల కోణంలో చూసింది. ప్రధానిగా మోదీ జీ, హోంమంత్రిగా అమిత్ షా జీ, సీఎంగా యోగి (ఆదిత్యనాథ్) వ్యవహరించిన తీరు మనల్ని గర్వించేలా చేసింది. అందుకు వారికి క్రెడిట్ ఇస్తాను. ఆ జాతీయ సమైక్యతా భావం రామజన్మభూమిపై ఇప్పటి వరకు ఎలాంటి ఉద్రిక్తతలను సృష్టించడానికి అనుమతించలేదు.
*1990-’92 కాలంలో అల్లర్లు జరిగి ప్రజలు చంపబడ్డారు. మీ అభిప్రాయం ఏమిటి? రక్తపాతాన్ని నివారించకూడదా?
2010 అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఎలాంటి అల్లర్లు జరగలేదు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎలాంటి అల్లర్లు జరగలేదు. ఆ తర్వాత శిలాన్యాస్ కు ప్రధాని హాజరైనప్పుడు ఎలాంటి అల్లర్లు జరగలేదు. ఇప్పుడు ప్రారంభోత్సవం జరగనుండడంతో ఎలాంటి ఉద్రిక్తత, భయం లేదు. అంటే కాంగ్రెస్ పూర్తి ప్రణాళికతో 1990-’92లో విభజన పరిస్థితిని కల్పించి భయం సృష్టించింది.
అలాగే, కమ్యూనిస్టులు హిందువులను ద్వేషిస్తారు. హిందువులు, ముస్లింలు పోరాడాలని కోరుకుంటారు. అల్లర్లు జరగవు, అవి జరిగేలా చేయబడ్డాయి. హిందువులు, ముస్లింలు ప్రశాంతంగా జీవించవచ్చు.
* జనవరి 22న ప్రతిపక్ష నేతలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు మొదలైన వారికి ఆహ్వానాలు పంపడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్ష నేతలను ఆహ్వానించాలా?
ఆహ్వానాలు పంపడం (రామ మందిరం) ట్రస్ట్ నిర్ణయం. రాజకీయ పిలుపు కాదు. రామభక్తిపై మాకు కాపీరైట్ లేదు. భగవన్ రామ్, హనుమాన్ జీ బీజేపీ నాయకులు కాదు. వారు మన జాతీయ గౌరవం. వారి మందిరం. ప్రాణ ప్రతిష్ఠలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరినైనా ఆహ్వానించవచ్చు. నేను రాజకీయ నాయకులందరికీ కూడా చెబుతాను – దీనిని రాజకీయంగా చూడవద్దు. మీ ఇళ్లలో కూడా రాముడి ఫోటోలు ఉన్నాయి.
మీ పేర్లలో రాముడు ఉండవచ్చు. దానికి హాజరయితే ఓట్లు పోతాయని భయపడవద్దు. నేను బిజెపి సభ్యులకు కూడా చెబుతాను. రాముని భక్తిని మీరు మాత్రమే చేయగలరనే అహంకారాన్ని వదిలించుకోండి. నేను ప్రతిపక్షాలకు చెబుతాను – మీరు అక్కడికి వెళ్లకూడదనే భయాన్ని వదిలించుకోండి. అహంకారం లేదా భయం లేకుండా, మనమందరం సంతోషంగా పాల్గొనాలి.
* కాశీ, మధురలకు సంబంధించిన డిమాండ్లు కూడా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి?
1991లో అయోధ్యను స్వాతంత్య్రం వచ్చినప్పుడు దాని స్వభావాన్ని మార్చకూడదుని మత స్థలాలకు దూరంగా ఉంచే బిల్లు (ప్రార్ధనా స్థలాల చట్టం) తెచ్చినప్పుడు నేను పార్లమెంటులో చెప్పినట్లుగానే నా అభిప్రాయం ఉంది. రాబోయే తరాలు శాంతితో జీవించడానికి కాశీ, మధురలను కూడా మినహాయింపుగా చేర్చండి అని నేను చెప్పాను.
* జనవరి 22న అయోధ్యకు వెళ్తున్నారా?
జనవరి 18న అయోధ్యలో ఉండాలని, జనవరి 22 వరకు ఆగవద్దని ట్రస్ట్ నన్ను ఆదేశించింది. డిసెంబర్‌లో కూడా వారు నాకు ఫోన్ చేశారు. నేను అక్కడికి వెళ్లి జనవరి 18 నుంచి అయోధ్యలో ఉంటాను. వాళ్ళు ఏ పని ఇచ్చినా చేస్తాను.
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుండి)
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు