లక్షద్వీప్‌ లో కొత్త ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్న కేంద్రం

`బాయ్‌కాట్‌ మాల్దీవులు’ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హం పెల్లుబికింది. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. లక్షద్వీప్‌ మినీకాయ్ ద్వీపంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 
 
దీంతో లక్షద్వీప్‌లో పర్యాటకరంగం మరింత పెరుగుతుందని భావిస్తున్నది. కొత్తగా విమానాశ్రయం నిర్మిస్తే మిలటరీకి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. పౌర విమానాలతో పాటు మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్‌ జెట్స్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్‌ జాయింట్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సైనికపరంగా కొత్త విమానాశ్రయం నిర్మాణంతో అరేబియా సముద్రం, హిందు మహాసముద్రం పర్యవేక్షణలో భారత్‌కు వ్యూహాత్మకంగా సహాయపడుతుంది. మినీకాయ్ ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

తాజాగా ప్రతిపాదనలో భారత వైమానిక దళం కార్యకలాపాలకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం లక్షద్వీప్‌పైనే ఉన్నది. మినీకాయ్‌లో విమానాశ్రయం నిర్మాణం చేపడితే లక్షద్వీప్‌లో పర్యాటకం సైతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

ప్రస్తుతం లక్షద్వీప్‌లోని అగట్టి ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంది. కానీ అన్ని రకాల విమానాలు ఇక్కడ దిగలేవు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటిప్పటి నుంచి లక్షద్వీప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో మోదీ షేర్‌ చేసిన చిత్రాలను చూసిన నెటిజన్స్‌ లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులు భారత్‌తో పాటు ప్రధానిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం తర్వాత ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం వేటు వేసింది.

భారత్‌ మాకు సన్నిహిత దేశం

మరోవంక, భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవ్స్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను ‘మాల్దీవ్స్‌ అసోషియేషన్ ఆఫ్‌ టూరిజం ఇండస్ట్రీ (ఎమ్యెటిఐ)’ ఖండించింది.  మాల్దీవ్స్‌కు అత్యంత సన్నిహిత దేశాల్లో భారత్‌ ఒకటని, భారత్‌తో తమకు మంచి అనుబంధం ఉన్నదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.  తాము సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారి ముందుగా స్పందించే దేశం భారతేనని తెలిపింది.
కరోనా సమయంలో కూడా భారత్‌, భారతదేశ ప్రజలు చేసిన మేలును మరువలేమందని గుర్తు చేసుకుంది.  మాల్దీవ్స్‌ పర్యాటక రంగం బలోపేతానికి కూడా భారత్‌ సహకారం మరువలేనిదని ఎమ్యెటిఐ  తెలిపిందిఎప్పటిలాగే భారత్‌-మాల్దీవ్స్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. కొందరు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అనుబంధంపై ప్రభావం చూపవని భావిస్తున్నామని అభిప్రాయపడింది.

ప్ర‌ధాని మోదీకి శ‌ర‌ద్ ప‌వార్ సంఘీభావం

మాల్దీవుల వివాదం నేప‌ధ్యంలో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇత‌ర దేశం ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హరిస్తే ఉపేక్షించేది లేద‌ని ఆయన స్పష్టం చేశారు. మోదీ దేశ ప్ర‌ధాని అని, ఏ ఇత‌ర దేశం నుంచి ఎలాంటి హోదాలో ఉన్న వ్య‌కైనా మ‌న ప్ర‌ధానిపై అలాంటి వ్యాఖ్య‌లు చేస్తే తాము అంగీక‌రించ‌బోమ‌ని ఆయన హెచ్చరించారు. ప్ర‌ధాని ప‌ద‌విని మ‌నం గౌర‌వించాల‌ని తేల్చి చెప్పారు.