చంద్రుడిపైకి దిగాలన్న అమెరికా యత్నాలకు చుక్కెదురు

చంద్రుడిపైకి దిగాలన్న అమెరికా యత్నాలకు చుక్కెదురు
దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ఒక ల్యాండర్‌ను పంపించాలని అమెరికా చేసిన ప్రయత్నం చుక్కెదురైంది. ఓ ప్రైవేటు కంపెనీతో కలిసి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేసిన ప్రయోగం దాదాపు విఫలమైంది.  ఇంధన లీకేజీ కారణంగా నింగిలోకి పంపించిన పెరిగ్రిన్ వ్యోమనౌక  దాని కీలక ప్రొపెల్లెంట్‌ను కోల్పోయిందని, ఈ ప్రయోగాన్ని అభివృద్ధి చేసిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అనే ప్రైవేటు కంపెనీ వెల్లడించింది.
ఇంధన లీక్‌ కారణంగా ల్యాండర్‌ థ్రస్టర్లు నిర్దేశిత క్రమంలో పనిచేయడం లేదని తెలిపింది.  దీంతో పెరిగ్రిన్‌ వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలన్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ ప్రకటించింది. అయితే ఈ మిషన్‌ లక్ష్యాలను ప్రస్తుతం పునఃసమీక్షించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది.
ఇంధన లీక్ కారణంగా వ్యోమనౌక కీలక ప్రొపెల్లెంట్‌ను కోల్పోయిందని ఆ సంస్థ తెలిపింది. 
 
ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సోమవారం వుల్కన్‌ రాకెట్‌ ద్వారా పెరిగ్రిన్‌ వ్యోమనౌక అంతరిక్షంలోకి ప్రయాణించింది. సరిగ్గా పెరిగ్రిన్ వ్యోమనౌక నింగిలోకి ఎగిరిన 7 గంటల తర్వాత సమస్య తలెత్తింది. ల్యాండర్‌కు సంబంధించిన సోలార్ ప్లేట్.. సూర్యుడికి ఎదురుగా లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
 ప్రొపెల్లెంట్‌ కోల్పోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తేల్చారు. దీంతో సోలార్ ప్లేట్‌పై సూర్యకాంతి పడక.. పెరిగ్రిన్‌ బ్యాటరీల ఛార్జింగ్‌ కోసం కావాల్సిన విద్యుదుత్పత్తి జరగడం లేదని వెల్లడించారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు బ్యాటరీల సమస్యను పరిష్కరించారు. అయినా ప్రొపెల్లెంట్‌ లేకపోవడంతో ఏర్పడిన ప్రధాన సమస్యను మాత్రం ఏమీ చేయలేకపోయారు.
 
అయితే సమయానికి అనుగుణంగా పెరిగ్రిన్‌ దిశను మార్చే యాటిట్యూడ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లోని థ్రస్టర్లు.. ఇంధనం లీకేజీ కావడంతో నిర్దేశిత క్రమంలో పనిచేయడం లేదని ఆస్ట్రోబోటిక్‌ సంస్థ ప్రకటించింది. అయితే ఆ థ్రస్టర్లు గరిష్ఠంగా మరో 40 గంటలు మాత్రమే పనిచేసే అవకాశం ఉందని వెల్లడించింది. 
ఆ తర్వాత సూర్యుడికి అభిముఖంగా పెరిగ్రిన్ వ్యోమనౌక దిశను మార్చడం కుదరదని.. ఫలితంగా విద్యుదుత్పత్తి ఆగిపోతుందని తెలిపింది.
అయితే ఆ 40 గంటలలోపే పెరిగ్రిన్‌ వ్యోమనౌకను వీలైనంతంగా చంద్రుని వద్దకు తీసుకెళ్లడమే తమ ముందు ఉన్న ప్రస్తుత లక్ష్యమని ఆస్ట్రోబోటిక్ వివరించింది.
ఈ పెరిగ్రిన్‌ ల్యాండర్‌ను చంద్రుడిపై దించేందుకు 108 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.900 కోట్లకు ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ సంస్థతో.. నాసా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెరిగ్రిన్ వ్యోమనౌక ఎత్తు 6 అడుగులు. 
 
ఈ పెరిగ్రిన్‌లో చంద్రుడిపై నీటి జాడలను శోధించే ‘పెరిగ్రిన్‌ అయాన్‌ మాస్‌ స్పెక్ట్రోమీటర్‌’ సహా పలు పరికరాలను నింగిలోకి పంపించారు. వాటితోపాటు ఎవరెస్ట్ పర్వతం నుంచి సేకరించిన రాయి ముక్క, చిన్న రోవర్లు, మెక్సికోకు చెందిన రోబోలు, వికీపీడియా కాపీ, ఒక బిట్‌కాయిన్‌, కొన్ని ఫొటోలు, డ్రాయింగ్స్‌, ఆడియో రికార్డింగ్‌లు పెరిగ్రిన్‌ వ్యోమనౌకలో పంపించారు. 
 
వీటితోపాటు అమెరికా మాజీ అధ్యక్షులు జాన్‌ ఎఫ్‌ కెనెడీ, జార్జ్‌ వాషింగ్టన్‌, ఐజన్‌హోవర్‌, స్టార్‌ ట్రెక్‌ టీవీ సీరియల్ సృష్టికర్త జీన్‌ రాడన్‌ బెర్రీ, ప్రముఖ సైన్స్‌ కాల్పనిక సాహిత్య రచయిత ఆర్థర్‌ సి క్లార్క్‌కు సంబంధించిన అవశేషాలు, డీఎన్‌ఏనూ తీసుకెళ్లింది.