అర్జున అవార్డును అందుకున్న మహ్మద్ షమీ

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో షమీ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.  బ్యాడ్మింటన్ జంట చిరాగ్ శెట్టి, సాత్విక్‌రాజ్ రంకిరెడ్డికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం దక్కింది.
ఈసారి మొత్తం 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు లభించింది. సాత్విక్ రంకిరెడ్డితోపాటు అర్జున అవార్డు అందుకున్న అజయ్ కుమార్ సైతం ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం. 2023 వన్డే వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ అసాధారణ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్య గాయపడటంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న షమీ ఆ టోర్నీలో మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు.
అర్జున అవార్డును అందుకోవడం పట్ల షమీ స్పందిస్తూ తన కల సాకారమైందని అంటూ సంతోషం వ్యక్తం చేశారు.  ఎంతో మంది తమ జీవిత కాలంలో ఈ అవార్డును అందుకోలేకపోయారని, అలాంటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికవ్వడం గర్వంగా ఉందని తెలిపారు.  ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న షమీ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌‌లో ఆడలేకపోయాడు. ఈ నెలాఖరులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా తొలి రెండు టెస్టులకు షమీ దూరం అయ్యే అవకాశం ఉంది. 
 
భారత్‌లో రెండో అత్యున్నత క్రీడా పురస్కారంగా అర్జున అవార్డును పరిగణిస్తారు. 1991-92లో ఖేల్ రత్న అవార్డును ప్రవేశపెట్టడానికి ముందు వరకూ అర్జున అవార్డు అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉండేది. అర్జున అవార్డు గెలిచిన వారికి విల్లు ఎక్కుపెట్టిన అర్జునుడి కాంస్య విగ్రహంతోపాటు ప్రశంసాపత్రం, రూ.15 లక్షల నగదును అందిస్తారు.
 
అర్జున అవార్డు అందుకోవడం ద్వారా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ లాంటి దిగ్గజ క్రికెటర్ల సరసన షమీ చేరాడు. ఇప్పటి వరకూ 58 మంది క్రికెటర్లు అర్జున అవార్డును అందుకోగా, వారిలో  12 మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు.

అంధుల క్రికెట్లో భారత జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డికి సైతం అర్జున అవార్డు దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్ చిన్నతనంలో కంటి చూపు కోల్పోయారు. 2010లో భారత జట్టులో చోటు దక్కించుకున్న అజయ్ కుమార్ 2012లో జరిగిన అంధుల టీ20 వరల్డ్ కప్‌, 2014లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2016లో అతడు భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు.