ఆ రాత్రి దాయాది వెన్నులో వణుకు.. పాకిస్తాన్ ఎందుకంత భయపడింది..? 

“అభినందన్ వర్ధమాన్ ను విడిచిపెట్టి పాకిస్తాన్ మంచిపని చేసింది. లేదంటే వారు భయంకరమైన రాత్రి చవిచూడాల్సి వచ్చేది.” 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలివి. ఏదో ఎన్నికలున్నాయని.. ఓట్లు రాలుతాయని ఆ రోజు ప్రధాని మోడీ ఈ మాటలు చెప్పలేదు. ఆ రోజు రాత్రి కనుక నిజంగానే అభినందన్ ను పాకిస్తాన్ విడిచిపెట్టకపోతే జరగబోయే పరిణామాలు.. చరిత్రలో లిఖించబడి ఉండేవి. భారత్ చేతిలో పాకిస్తాన్ పరిస్థితి ఏమయ్యేదో ఊహకు కూడా అందేది కానిది.
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. 2019 ఫిబ్రవరి 27 న మిగ్-21 లో ప్రయాణిస్తూ.. పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో పాకిస్తాన్ కు చెందిన జెట్ విమానాన్ని కూల్చివేశాడు. అయితే అనూహ్యంగా.. తను ప్రయాణిస్తున్న మిగ్ కూలడంతో ప్యారాచూట్ సాయంతో దాయాది భూభాగంలో దిగాడు. దీంతో వెంటనే అక్కడి సైనికులు అభినందన్ ను పట్టుకుని చిత్రహింసలకు గురిచేశారు.
వాస్తవానికి మనదేశ సైనికుడు దొరికితే పాకిస్తాన్ ఎన్నో కండీషన్లు పెట్టి ఉండాలి. వారి డిమాండ్లకు ఒప్పుకుంటేనే పట్టుబడ్డ సైనికుడిని విడిచిపెట్టాలి. కానీ.. అప్పుడు భారత్ ను ఏలుతున్నది సంకీర్ణ ప్రభుత్వం కాదు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఇది తెలిసే.. భారత్ సైనికుడు పట్టుబడ్డాడన్న వార్తతో పాక్ పాలకులు వణికిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే వారికి కాళ్లూ చేతులు ఆడలేదు. ఈ విషయాన్ని ఆ సమయంలో పాకిస్తాన్ లో ఉన్న భారత రాయబారి తన పుస్తకంలో రాసుకొచ్చారు.
అజయ్ బిసారియా.. భారత మాజీ హైకమిషనర్. “యాంగర్ మేనేజ్‌మెంట్:ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్ బిట్‌విన్ ఇండియా అండ్ పాకిస్తాన్” అనే పుస్తకాన్ని రచించారు.
ఆ రోజు అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ కు చిక్కాడన్న వార్తతో భారత్ దాయాదిపైకి ఏకంగా 9 క్షిపణులతో దాడికి సిద్ధమైందని అజయ్ బిసారియా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పాక్.. వణికిపోయిందని.. అదే సమయంలో భారత్ లో పాక్ హై కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సోహైల్ మొహ్మద్ తనను ఇస్లామాబాద్ లో కలిశారని, వివరించారు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని మోడీతో మాట్లాడాలనుకుంటున్నారని.. సోహైల్ తనతో చెప్పారని అజయ్ తెలిపారు. అయితే తాను వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారం ఇచ్చానని.. కానీ ఆ సమయంలో ప్రధాని మోడీ అందుబాటులో లేరని.. తనకు సమాధానం వచ్చిందని స్పష్టం చేశారు.అయితే అభినందన్ ను విడిచిపెట్టకపోతే.. భారత్ తీవ్రమైన దాడికి దిగుబోతుందనే సందేశం పాకిస్తాన్ కు చేరుకుంది.
దీంతో పరిస్థితిని చల్లబర్చేందుకు ఇమ్రాన్ ఖాన్.. మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నించారని అజయ్ తెలిపారు. అయితే మోడీతో మాట్లాడేందుకు వీలు లేకపోవడంతో కేవలం రెండు రోజుల్లోనే అభినందన్ ను పాకిస్తాన్ విడిచిపెట్టిందని అజయ్ బిసారియా వివరించారు. దీంతో పాటు 26/11 అటాక్స్, 2016 లో సర్జికల్ స్ట్రైక్స్, 1980-90 ల్లో పంజాబ్, కశ్మీర్ లో జరిగిన మారణహోమాన్ని కూడా ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు. భారత్ ఒకప్పటిలా కాకుండా.. తిరిగి సమాధానం చెబుతుందని.. ఆ విషయం పాకిస్తాన్ కు అర్థమైందని అజయ్ బిసారియా చెప్పారు.