ప్రధాని పర్యటనతో లక్షద్వీప్‌ పర్యాటకంపై ఆసక్తి

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన తర్వాత  కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ కు వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఆల్‌ ఇండియా టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం గత మూడు రోజుల్లో లక్షద్వీప్‌కు భారీగా బుకింగ్‌ వస్తున్నాయి.  రాబోయే మూడు నెలల ట్రిప్‌ కోసం మూడురోజుల్లోనే చాలా ముంది బుకింగ్స్‌ చేసుకుంటున్నారు.

రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్‌ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ సన్నాహాలు ప్రారంభించింది. లక్షద్వీప్‌, కేరళకు కేవలం విమానం మార్గమే ఉంది. దాంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో నేరుగా అనుసంధానం చేస్తే లక్షద్వీప్‌ పర్యాటకం పెరుగుతుందని ఆల్‌ ఇండియా టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

మోదీ పర్యటన తర్వాత సోషల్‌ మీడియాలో అత్యధికంగా సెర్చ్‌ చేసిన పదాల్లో లక్షద్వీప్‌ అగ్రస్థానంలో ఉంది. గత మూడు రోజుల్లో లక్షద్వీప్‌కు అత్యధిక సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యదర్శి అజయ్ భల్లా చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో తన సంస్థతో అనుబంధం ఉన్న టూర్ ఆపరేటర్ల భారీగా కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుంటున్నట్లు తెలిపారు.

టూర్‌ ఆపరేటర్లు లక్షద్వీప్‌ కోసం దేశవ్యాప్తంగా 7వేలకంటే ఎక్కువగా బుకింగ్స్‌ను అందుకున్నారని తెలిపారు. లక్షద్వీప్‌ను సందర్శించేందుకు అక్టోబర్‌ నుంచి మార్చి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో లక్షద్వీప్‌లో పర్యాటకం గరిష్ట స్థాయికి చేరుకుందని తెలిపారు.

లక్షద్వీప్‌లోని ఇతర పర్యాటక ప్రదేశాల్లాగా ఆ సౌకర్యాలు ఇప్పటికీ లేవని, రాబోయే రోజుల్లో సౌకర్యాలు పెరిగి పర్యాటకానికి డిమాండ్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేరళలోని కొచ్చి నుంచి మాత్రమే లక్షద్వీప్‌కు నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయని ఇండియా ట్రావెల్ మార్ట్‌కు చెందిన జతిన్ సాహ్ని చెప్పారు.

ఇక్కడి ఓడరేవు నుంచి ఫెర్రీ (ఓడ) ద్వారా కూడా లక్షద్వీప్ చేరుకోవచ్చని జతిన్ వివరించారు. ఇటీవలి కాలంలో లక్షద్వీప్‌ను సందర్శించే వారి సంఖ్య బాగా పెరిగిందని, అయితే నేరుగా కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రజలు లక్షద్వీప్‌కు బదులుగా అండమాన్ నికోబార్ వైపు వెళ్లేందుకు ఇష్టపడుతారని చెప్పారు.