సీఆర్పీఎఫ్ నుంచి యుపి పోలీసులకు అయోధ్య భద్రత

సీఆర్పీఎఫ్ నుంచి యుపి పోలీసులకు అయోధ్య భద్రత
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న ప్రాంతం భద్రత త్వరలో కేంద్ర భద్రతా బలగాల చేతుల్లో నుంచి తిరిగి యూపీ పోలీసుల చేతుల్లోకి వెళ్లబోతోంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్ కు ఈ ప్రాంతం భద్రత అప్పగించారు. 
 
ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత తిరిగి ఈ ప్రాంతంపై వివాదాలు సమసిపోవడం, రామాలయ నిర్మాణం కూడా పూర్తి కావడంతో తిరిగి యూపీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోబోతున్నారు.  అయోధ్య రామాలయం మహాసంప్రోక్షణ జరిగే జనవరి 22వ తేదీ నుంచి యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీఆర్పీఎఫ్ నుంచి భద్రతను తమ చేతుల్లోకి తీసుకోబోతున్నారు. 
ఈ మేరకు కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ బలగాలు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అయోధ్య రామాలయ ప్రాంత భద్రతను అప్పగించి తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1992లో దశాబ్దాలుగా సాగిన రామజన్మభూమి వివాదం తర్వాత బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రాంతానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించారు.  ఈ నేపథ్యంలో 32 ఏళ్లుగా సీఆర్పీఎఫ్ ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాపలా కాస్తోంది. ఇప్పుడు రామాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ట తర్వాత పరిస్దితులు సాధారణ స్ధితికి వస్తాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి సీఆర్పీఎఫ్ భద్రత అవసరం లేదని కేంద్రం, యూపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.