మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ బుధవారం కూడా మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాలేదు. విచారణకు రమ్మంటూ ఈడీ పంపిన నోటీసులను ఆయన లెక్కచేయలేదు. ఈడీ నోటీసులు అందుకోవడం ఆయనకు ఇది మూడోసారి. అయినా కేజ్రీవాల్ స్పందించలేదు. 

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులను పట్టించుకోని కేజ్రీవాల్  తాను విచారణకు హజరు కావడం లేదంటూ ఈడీకి తిరిగి లేఖ రాసినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు సార్లు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేసిన అరవింద్ కేజ్రీవాల్  తాజాగా తిరస్కరించడంతో మూడోసారి అయింది. 

దీంతో ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదా అనే వాదన తెరపైకి వచ్చింది. ఢిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా ఈడీ దర్యాప్తుకు సహకరించడానికి కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ  ఇప్పుడు నోటీసులు ఎందుకు పంపించారని ఆప్ ప్రశ్నించింది. 

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అరవింద్ కేజ్రీవాల్‌ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈడీ నోటీసులు పంపించిందని ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈ నోటీసులు పంపించారని ఆప్ ఆరోపించింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని గతేడాది నవంబర్ 2, డిసెంబరు 21 వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

కానీ ఈ విచారణలకు ఆయన హాజరు కాలేదు. 2 సార్లు ఈడీ అధికారులు నోటీసుల ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కావడం లేదని పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించేందుకు పిలిచింది.

ఈ కేసులో ఇలాగే విచారణకు పిలిచిన ఆప్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి సిసోడియాలను అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అదే తరహాలో కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.