ఈసారీ కారుకు రిపేరేనా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల దాటుతోంది. ఇప్పుడు అందరి చూపూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే భారతీయ జనతాపార్టీ భారీ స్థాయిలో ఓట్లు, సీట్లను కైవసం చేసుకుంది. కమలం పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టగా.. ఏకంగా 13.90 శాతం వరకు ఓట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ వరకు ఓటింగ్ పర్సంటేజీ లెక్కల్లో ఎలాంటి పంచాయితీ లేనప్పటికీ.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మధ్య మాత్రం ఆసక్తికర పంచాయితీ నడుస్తోంది.

వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య 2 కంటే తక్కువ శాతమే ఓట్ల తేడా ఉందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. దీనిని చాలా తొందరగానే ఓవర్ కమ్ చేసేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే,  గ్రేటర్ హైదరబాద్ ఓటింగ్ సరళని మినహాయిస్తే.  తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య 10 శాతం కంటే ఎక్కువ తేడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

64 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 92 లక్షల 32 వేల 792 ఓట్లు వచ్చాయి. ఇది 39.40 శాతంగా నమోదైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 87 లక్షల 53 వేల 924 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇది 37.35 శాతంగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 లక్షల 81 వేల 868 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది.

ఉత్తర, దక్షిణ తెలంగాణ రీజియన్లలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి అధికంగా 11 లక్షల 33 వేల 868 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌లో ఉన్న 25 సీట్లలో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 38.97 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 25.53 శాతానికే పరిమితం అయింది. దీంతో ఇక్కడ లభించిన ఆధిక్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్వయించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దీనికి ఉదాహరణగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో పోలైన ఓట్ల శాతాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. 51 సీట్లు ఉన్న ఉత్తర తెలంగాణలో మొత్తం 41.26 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 33 సీట్లను గెలుచుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 34.64 శాతం ఓట్లతో కేవలం 10 సీట్లను మాత్రమే గెలుచుకోగా.. బీజేపీకి 15.66 శాతం ఓట్లతో ఏకంగా 7 స్థానాలు దక్కాయి. ఈ రీజియన్‌లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి 6.62 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి.

ఇక 43 సీట్లు ఉన్న దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే.. 45.86 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 30 సీట్లను గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 39.29 శాతం ఓట్లతో కేవలం 13 సీట్లకే పరిమితం అయ్యింది. ఇక్కడ కూడా 6.57 శాతం వరకు ఓట్ల తేడా కనిపించింది. అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఈ స్థాయిలో తేడా ఎందుకు వస్తుందని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.