జపాన్‌ను వెంటాడుతోన్న వరుస భూకంపాలు..

ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోతున్న సమయంలో.. తూర్పు ద్వీప దేశం జపాన్ మాత్రం వరుస భూ ప్రకంపనలతో వణికి పోయింది. వరుసగా రెండు రోజుల పాటు.. భూకంపాలు సంభవించాయి. ఏకంగా 155 సార్లు భూమి కంపించినట్లు.. అక్కడి వాతావరణ కేంద్రం ప్రకటించడం చూస్తుంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రిక్టర్ స్కేల్ పై 3 నుంచి 7.6 మధ్య తీవ్రత నమోదైంది. అదే సమయంలో సంభవించిన అగ్నిప్రమాదంతో నష్టం తీవ్రస్థాయికి చేరుకుంది. అయితే ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో భవనాలు కూలటంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి నష్టం ఎంత అన్న దాన్ని అంచనా వేయడం.. ప్రస్తుతం జపాన్ ముందున్న లక్ష్యంగా మారింది. ఎందుకంటే ఆగకుండా చోటు చేసుకుంటున్న భూ ప్రకంపనలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భవనాలు కూలడంతో పాటు.. అగ్నిప్రమాదం వల్లే నష్టం మొత్తం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశమైన వాజిమాలో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇక్కడ 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. కనీసం వాహనాలు కూడా వెళ్లలేని స్థితిలో రోడ్లన్నీ బీటలు వారాయి. అలాగే సమీపంలోని ఓ వీధిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ధాటికి.. ఏకంగా 200 భవనాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా.. నష్టం మాత్రం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు అక్కడ 14 మంది మృత్యువాత పడ్డారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని మొత్తం 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరోవైపు సునామీ వస్తున్నందన్న భయాలతో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే అలలు 1.2 మీటర్ల ఎత్తులో పెద్ద ఎత్తున తీరాన్ని తాకినప్పటికీ.. సునామీ ప్రభావం లేదని అధికారులు తేల్చారు. దీంతో సునామీ హెచ్చరిలక తీవ్రతను తాజాగా తగ్గించారు. అయితే మళ్లీ భూకంపాలు, సునామీ వచ్చే అవకాశాలున్నట్లు తాజా ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగానే ఉండాలంటూ సూచించారు. ఇటు అర్ధాంతరంగా నిలిపేసిన బుల్లెట్ రైళ్లను కూడా పునరిద్దరించినట్లు వెల్లడించారు.