అయ్యప్ప మాలధారుని కాలు విరగ్గొట్టిన బైరి నరేష్..!

అయ్యప్ప మాలధారుని కాలు విరగ్గొట్టిన బైరి నరేష్..!
గతంలో అయ్యప్ప జన్మవృత్తాంతంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నాస్తికవాదిగా చెప్పుకుంటున్న బైరి నరేశ్ ఈ సారి ఏకంగా అయ్యప్ప మాలధారుడిని కారుతో ఢీ కొట్టాడు. ఆ భక్తుని కాలు విరగడానికి కారణమయ్యాడు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓ ఫంక్షన్‌ హాలులో భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు కొండగొర్ల రాజేశ్‌ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి  బైరి నరేష్‌ కూడా హాజరయ్యాడు ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు, కొందరు శివ స్వాములు అక్కడికి చేరుకున్నారు.
నరేష్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా నిరసనకు దిగారు. దీంతో కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన నరేష్.. కారెక్కి వేగంగా అయ్యప్ప భక్తుల మీదుగా పోనివ్వాలని డ్రైవర్‌ను ఆదేశించాడు. దీంతో నరేష్ కారు.. నిరసన తెలుపుతున్న పోగు నర్సింలు అనే అయ్యప్ప మాలధారుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నర్సింలు కాలు విరిగింది. అక్కడున్న పలువురికి గాయాలయ్యాయి.  ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అయ్యప్పలు..  కార్యక్రమాన్ని నిర్వహించిన కొండగొర్ల రాజేశ్‌ ను బాద్యుడిగా చేస్తూ.. పోలీసులకు అప్పగించారు. బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే ప్రమాదానికి కారణమైన బైరి నరేష్ కారుతో సహా పరారయ్యాడు. ఈ క్రమంలోనే యాక్సిడెంట్‌కు గురయ్యాడు. అయితే వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోపు అక్కడి నుంచి బైరి నరేష్, కారు డ్రైవర్‌ కూడా మరోసారి   పరారయ్యారు. ఇటు అయ్యప్పల కంప్లైంట్ మేరకు నరేష్, కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తాను మాత్రం ఎవరిపై దాడి చేయలేదని.. ఎక్కడికి పారిపోలేదని బైరి నరేష్ చెబుతున్నాడు.
ఏడాది క్రితం అయ్యప్ప జన్మవృత్తాంతంపై నరేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో 45 రోజుల పాటు చర్లపల్లి జైలులో ఉన్న నరేష్.. కొడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. బయటకు వచ్చాడు. అయితే ఆ తర్వాత కూడా తాను మారలేదు. మరోసారి ఇదే అంశంపై మళ్లీ నోరు పారేసుకున్నాడు. హన్మకొండలో అయ్యప్ప భక్తుల నుంచి బైరి నరేష్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే తాను ఉద్దేశ్యపూర్వకంగానే అయ్యప్పపై వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు.