ప్రతిష్ఠాత్మక బ్రిటిష్‌ పురస్కారానికి తెలంగాణ బిడ్డ

ప్రతిష్ఠాత్మక బ్రిటిష్‌ పురస్కారానికి తెలంగాణ బిడ్డ
బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీబీఈ (కమాండర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటీష్‌ ఎంపైర్‌) అవార్డు తెలంగాణ బిడ్డకు దక్కింది. బ్రిటీష్‌లో 2024కి ఇవ్వనున్న అవార్డులకు డిసెంబర్‌ 29న ప్రచురితమైన ఆనర్స్‌ లిస్ట్‌లో 15 కామన్‌వెల్త్‌ దేశాలకు చెందిన చాలా మంది ప్రముఖులుండగా అందులో నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ కన్నెగంటి చంద్రకు చోటు దక్కింది.

హాలీవుడ్‌ దిగ్గజ నటులు, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ స్టీవ్‌ రైట్‌, రచయిత అలెగ్జాండర్‌ మెక్‌కాల్‌ స్మిత్‌, బ్రెగ్జిట్‌ మద్దతుదారు టిమ్‌ మార్టిన్‌ల సరసన ఇందూరు బిడ్డ నిలిచారు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన కన్నెగంటి చంద్ర ఇక్కడ వైద్య విద్యను పూర్తి చేసి బ్రిటన్‌కు వెళ్లి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఈయన జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మారం గ్రామంలో జన్మించారు.

నిర్మల్‌లో రెండో తరగతి, ఆ తర్వాత ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లో చదవివారు. అనంతరం గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. 2002లో లండన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జనరల్‌ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూ.. ఆ అసోసియేషన్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు.  30 ఏండ్లుగా అక్కడే విశేషమైన సేవలందిస్తున్నారు. 

వైద్యరంగంలో జనరల్‌ ఫిజీషియన్‌గా విశేషమైన కృషిచేస్తూనే కన్జర్వేటివ్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సిటీ కౌన్సిల్‌లో 2020 సెప్టెంబర్‌లో డిప్యూటీ లార్డ్‌ మేయర్‌గా అనూహ్యంగా ఎన్నికైన డాక్టర్‌ చంద్ర.. అనంతరం 2021, మే 22న లార్డ్‌ మేయర్‌ పదవికి పోటీ చేసి విజయం సాధించారు. 

వైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న కన్నెగంటి చంద్రను అక్కడి ప్రభుత్వం గుర్తించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీబీఈ అవార్డుకు ఎంపిక చేసింది. నూతన ఏడాది ప్రారంభోత్సవంలో ఒకసారి, బ్రిటన్‌ రాజు అధికారిక పుట్టిన రోజున మరోసారి ఈ అవార్డులను అందిస్తారు. బ్రిటన్‌లో అసాధారణమైన సేవలతో గుర్తింపు పొందిన వారికి మాత్రమే ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు భారతదేశంలో పద్మ పురస్కారంతో సమానం.

స్థానిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆయనకు వచ్చిన ఆదరణ చూసి అక్కడ వచ్చే ఏడాదిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. భారత మూలాలున్న ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.