ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ని అప్పగించండి

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ని అప్పగించండి
2008 నవంబర్ 26 అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న దేశ వాణిజ్య రాజధాని ముంబై ఉగ్రవాదుల మారణహోమంతో అట్టుడికి పోయేందుకు కీలక సూత్రధారి లష్కరే తోయిబా‌ అధినేత హఫీజ్ సయీద్ ను పెట్టుకొనేందుకు భారత్ తన పట్టు విడవటం లేదు. ఆ రోజున  ముంబైలోని ప్రముఖ ప్రాంతాల్లోకి ఆయుధాలతో చొరబడిన 10 మంది ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనలో 166 మంది భారతీయులతోపాటు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. 
 
పాక్‌లో ఉంటున్న హఫీజ్ సయీద్‌ను భారత్‌కు రప్పించేలా కేంద్ర ప్రభుత్వం ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఈ క్రమంలోనే హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని అధికారికంగా పాకిస్థాన్‌ను భారత్ అడిగినట్లు మీడియా కథనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హఫీజ్‌ సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. 
 
అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 26/11 ముంబై పేలుళ్లు మాత్రమే కాకుండా దేశంలో మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 
 
అతనిపై అమెరికా 10 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.82 కోట్ల రివార్డ్‌ ప్రకటించింది. వీటితోపాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్‌ కేసుల్లోనూ హఫీజ్‌ సయీద్‌పై ఎన్నో కేసులు నమోదయ్యాయి.  ముంబై పేలుళ్ల కేసులో విచారణ చేసేందుకు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత్‌ ఎన్నోసార్లు పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేసింది.
అయితే భారత్‌ పాక్‌ మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా మారింది. ఇక ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న పలు కేసుల్లో హఫీజ్‌ సయీద్ పాకిస్థాన్‌లో 2019లో అరెస్ట్ అయ్యాడు.  ఈ కేసులకు సంబంధించి అతడికి మొత్తం 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ప్రస్తుతం పాక్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నన్న హఫీజ్‌ సయీద్ జైలు నుంచే పాక్ రాజకీయాలను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ క్రమంలోనే హఫీజ్ సయీద్‌ ఏర్పాటు చేసిన ‘ది పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌’ (పీఎంఎంఎల్‌) పార్టీ వచ్చే ఏడాది జరగనున్న పాక్‌ జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.  ఈ పార్టీ తరఫున హఫీజ్‌ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు.