తొలి టెస్టులో ఎదురీదుతున్న భారత్

సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఊహించని షాక్ ఎదురైంది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ బ్యాటింగ్ లో పూర్తిగా తడబడింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (105 బంతుల్లో 70 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. సిరాజ్ క్రీజులో ఉన్నాడు. విరాట్ కోహ్లి 38, శ్రేయాస్ అయ్యర్ లు 31 పరుగులు.. భారీ స్కోర్లు చేయడంలో విఫలం కాగా.. శార్దూల్ 24 పరుగులతో రాహుల్ కు సహకరించాడు. వెలుతురులేమితో 59 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన వేళ తొలిరోజు సౌతాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ ఐదు వికెట్ల తో రాణించగా.. బర్గర్ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీశాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలో 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఫుల్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ ను ఔట్ చేసి రబాడ తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత బర్గర్ తన వరుస ఓవర్లలో యశస్వి, గిల్ ను ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులొకి వచ్చిన కోహ్లి, అయ్యర్ లు ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు జాగ్రత్తగా ఆడడంతో లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్లకు 91 పరుగులు చేసింది. అయితే లంచ్ విరామం అనంతరమే అయ్యర్ ఔట్ కావడం.. ఆ తర్వాత కోహ్లి రబాడ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇవ్వడం.. స్వల్ప వ్యవధిలో అశ్విన్ కూడా ఔటవ్వడంతో భారత్ 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

ఈ దశలో మరో వికెట్ పడుంటే భారత్ కథ 150 లోపే ముగిసేది. కానీ కేఎల్ రాహుల్ తన అనుభవాన్ని రంగరించాడు. అతనికి జతగా శార్దూల్ ఓపికగా నిలవడంతో భారత్ వికెట్లకు బ్రేక్ పడింది. ఈ ఇద్దరు ఏడో వికెట్ కు 43 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల పదునైన బంతులు ఇద్దరిని గాయపరిచినా ఏ మాత్రం నియంత్రణ కోల్పోకుండా ఓపికతో ఆడుతూ వచ్చారు. ఈ దశలో శార్దూల్ అనవసర షాట్ కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బుమ్రా పెద్దగా ఆకట్టుకోలేదు. మరో ఐదు ఓవర్ల పాటు రాహుల్ ఓపికగా ఆడి రోజును ముగించాడు.