ఉత్తరాదిని కమ్మేసిన భారీ పొగమంచు!

ఉత్తరాదిని కమ్మేసిన భారీ పొగమంచు!
 
* ఢిల్లీలో సున్నాకు పడిపోయిన దృశ్యమానత * ఆలస్యంగా 110 విమానాలు
 
దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం మూడుగంటల పాటు దృశ్యమానత సున్నాకు పడిపోయింది.
 
ఈ పొగ మంచు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో పలు చోట్ల దృశ్యమానత జీరోకు పడిపోయింది. ఈ కారణంగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 
 
బుధవారం దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అటు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజధానికి రావాల్సిన సుమారు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే వెల్లడించింది.
 
ప్రస్తుతం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చలికి తోడు రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత కూడా బాగా క్షీణించింది. సగటు గాలి నాణ్యత 381కి పడిపోయింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ప్రకారం ఆనందర్‌ విహార్‌ ప్రాంతంలో ఏక్యూఐ 441గా ఉంది. 
 
ఇక సెంట్రల్‌ ఢిల్లీలోని లోధి రోడ్డులో 327, అంతర్జాతీయ విమానాశ్రయంలో గాలి నాణ్యత 368గా ఉంది. ఘజియాబాద్‌, నోయిడాలో 336, 363గా ఉంది. వచ్చే వారంలో గాలి నాణ్యత మరింత దిగువకు పడిపోయే అవకాశం ఉందని అంచనా. బుధవారం నగరంలో గాలులు వీచే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 
 
దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.  ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది. 50 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.
 
వాయువ్య దిశ నుంచి మంచు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. పగటి సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, ఉదయం దట్టంగా పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది. చలిగాలుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 
 
అయితే, జనవరి ఒకటో తేదీ వరకు ఢిల్లీలో పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ముంగేష్‌పూర్‌లో 6.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  లోధి రోడ్ 7 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతున్నది. 
 
అలాగే, రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం పొగమంచు ప్రభావంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపగా.. పలు విమానాలు, రైళ్లను రద్దు చేశారు. ఉదయం పలుచోట్ల రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఎయిర్‌పోర్ట్ వాతావరణ విభాగం ప్రకారం.. రాబోయే 24 గంటలపాటు ఢిల్లీలో దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయి. 
 
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 30 నుంచి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలోని పలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం కొనసాగుతుందని పేర్కొంది.