ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రోజుకు 18 గంటల సేపు పనిచేయాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలా పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలని తేల్చి చెప్పారు. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్, డీజీపీకి చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలని, బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన భేటీలో ఘాటుగా హితవు చెప్పారు.
తమది ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం అంటూ ప్రజలతో స్నేహంగా ఉన్నంతవరకే స్నేహపూర్వక ప్రభుత్వం అవుతుందని చెప్పారు.
అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలమనే ఆలోచనతో ఉండాలని, అధికారులకు మానవీయ కోణం చాలా ముఖ్యమని హితవు చెప్పారు.
తెలంగాణ డీఎన్ఏలోనే స్వేచ్ఛ ఉందన్న రేవంత్ రెడ్డి ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా కలిసి పనిచేద్దామని పేర్కొంటూ శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులకు ఫుల్ పవర్ ఇస్తున్నామని ప్రకటించారు. అక్రమార్కులు, అవినీతి పరులు, భూకబ్జా దారులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించవద్దని రేవంత్రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా కలిసి పనిచేయాలని చెబుతూ సమన్వయం లేకపోతే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేమని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులేనని గుర్తుచేశారు. గ్రామ సభలు ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదన్న రేవంత్ రెడ్డి పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి అని తెలిపారు. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని కోరారు. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అధికారులు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాల్లో ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని చెప్పారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత