భిన్నత్వంలో ఏకత్వం.. అదే భారతీయం!

ఈ దేశం మనది, దేశానికి సేవ చేయాలనే స్ఫూర్తితో భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉత్తమ వేదికగా విద్యాలయాలు పనిచేయాలని రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి, ముఖ్యమంత్రి పూర్వ కార్యదర్శి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ విలువల్ని సాధించటంలో  స్విస్ విద్యాలయం ముందు వరుసలో నిలుస్తుందని ఆయన తెలిపారు.  

పిల్లలు కార్యయోధులుగా, కర్మయోధులుగా తయారవ్వాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ నందు ఉన్న శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ -స్విస్ లో ‘జిజ్ఞాస’ కార్యక్రమం  సందడిగా సాగింది. విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి, క్షేత్ర కోశాధికారి పసర్తి మల్లయ్య లతో కలిసి ఆయన ప్రారంభించారు.

స్విస్ వార్షికోత్సవం `భారతీయం’ థీమ్ తో రెండు రోజులు జరిగింది. భారతీయ స్ఫూర్తికి ప్రతిబింబం వివిధ రాష్ట్రాల సముదాయం. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు. అక్కడి సంస్కృతిని, వస్త్రాలంకరణను, వేష భాషలను తమ ప్రదర్శనలతో కళ్లకు కట్టారు.

భారతీయం అంటే ఏమిటో విద్యార్థులు తమ ప్రసంగాలు, కార్యకలాపాల ద్వారా వివరణగా చెప్పారు.  మన దేశ సంస్కృతిలో పండుగలు, మతాలు, భాషలు, దుస్తులు, సంగీతం, నృత్యం, ఆహారం, కళలు మొదలైనవి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉన్నప్పటికీ భారతప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వం అన్న స్ఫూర్తితో కార్యక్రమాలు సాగిపోయాయి. పాటలు, సంగీత కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనలు, సామూహిక ప్రదర్శనలతో రెండు రోజులూ మార్మోగిపోయాయి.

విద్యార్థులే అద్భుత ప్రతిభ చాటుతుంటే.. వారికి విద్య నేర్పిన గురువుల ప్రదర్శన ఇంకెలా ఉంటుందో కదా! ఉపాధ్యాయులందరూ కలిసి పాటకు పదం కలిపారు. తమ సత్తా చాటారు. పాటలు సైతం ఆలపించారు.  పాఠశాల ప్రిన్సిపాల్ గోకులన్ ఆలపించిన గీతాలు అందరినీ ఉర్రూతలూగించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పారిశ్రామికవేత్త గద్దె వెంకట నవీన్, సైకాలజిస్ట్ డాక్టర్ జగదీష్, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ సీవీఎస్ కిరణ్ విచ్చేశారు.