ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలని ఈసీ సంకేతాలు

ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలని ఈసీ సంకేతాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం  అధికారులు కసరత్తు చేస్తున్నారు.  కేంద్ర ఎన్నికల బృందం ఏపీలో శుక్ర, శనివారాలలో రెండు రోజులపాటు జరిపిన విస్తృత సమీక్షాలలో 2019లో మాదిరిగా 2024 ఏప్రిల్ లో  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే జరిగే అవకాశం ఉందని ఈసీ బృందం సూచనప్రాయంగా తెలిపింది.
 
శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన ఈసీఐ అధికారులు, శనివారం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల జాబితా-2024 రూపకల్పనపై కీలక సూచనలు చేస్తున్నారు. ఓట్ల జాబితాపై వస్తున్న ఆరోపణలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
 
ఎన్నికల నిర్వహణలో తప్పులు లేని ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, ఆ దిశలో కృషి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీష్‌కుమార్‌ వ్యాస్‌లు అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఎన్నికల బృందం ఆరా తీసింది. ఓటర్ల జాబితాలో అవ కతవకలపై కూడా ఎన్నికల అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది.
 
ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాన్ని అరికట్టాలని ఎన్నికల బృందానికి నాయకత్వం వహించిన డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ను కట్టుదిట్టం చేయాలని, చెక్ పోస్టులపై ఒక కన్ను వేసి ఉంచాలని సూచిం చారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిర్వహించాలని స్పష్టం చేశారు.
 
విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024, ఎన్నికల సన్నద్ధతపై ఈసీ అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సన్నద్ధత, ఓటర్ల జాబితా, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
 
 శుక్రవారం 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన ఈసీ బృందం శనివారం మరో 8 జిల్లాలపై సమీక్ష నిర్వహించింది. ఎన్నికల కోడ్ లో భద్రతా ఏర్పాట్లు, చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలన్న దానిపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.
 
చివరిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో భేటీ జరిపారు.  ఎన్నికలకు నాలుగు నెలలే సమయం ఉండడంతో అధికారులకు కీలక సూచనలు చేసింది. టీడీపీ, వైసీపీ, బీజేపీ… ఓటర్ల జాబితాపై చేసిన ఫిర్యాదులపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పరిశీలనలపై జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తప్పుడు సమాచారంలో ఫాం-7 దరఖాస్తులపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అయితే ఇప్పటికే బాధ్యులపై కేసులు నమోదు చేశామని ఆ జిల్లా కలెక్టర్‌ సమాధానమిచ్చారు.