కశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల మెరుపుదాడి

* ఐదుగురు జవాన్ల మృతి … మరో ఇద్దరికి గాయాలు
జమ్మూ కశ్మీర్‌లో గురువారం నాడు ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో సైనిక వాహనంపై మెరుపు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి  చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. అప్రమత్తమైన సైన్యం.. అదనపు బలగాలను అక్కడకు పంపింది. 
 
దీంతో సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.  పూంచ్ జిల్లా సురాన్‌కోటే ప్రాంతంలోని డేరా కి గలీ (డీకేజీ) వద్ద ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 
పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. జవాన్ల వాహనం ముందే వస్తుందన్న సమాచారం ఉగ్రవాదులకు ముందే తెలిసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. 
 
“డీకేజి (డేరా కి గాలీ) ప్రాంతంలో, థానమండి, రాజౌరిలో బుధవారం రాత్రి నుండి ఒక ఆపరేషన్ నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం సుమారు 3:45 గంటల సమయంలో, రెండు సైనిక వాహనాలు సైనికులను తీసుకొని ఆపరేషన్ ప్రాంతంకు వెడుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన వెంటనే సైనిక దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి” అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
 
గత నెలలో రాజౌరీ జిల్లా కాలాకోటే వద్ద ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు సైనికులు అమరులయ్యారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రమూకలకు నిలయంగా మారడంతో పాటు సైన్యంపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తీ దాడిని తీవ్రంగా ఖండించారు.
 
ఈ ఏడాది ఏప్రిల్, మే నెల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం 2003, 2021 మధ్య చాలా వరకు తీవ్రవాదం లేకుండా ఉంది. ఆ తర్వాత తరచుగా ఎన్‌కౌంటర్లు జరగడం మొదలయ్యాయి. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 35 సైనికులు అమరులయ్యారు.