ఇస్రోకు ఐరోపా దేశం నుంచి అరుదైన గౌరవం

ఇస్రోకు ఐరోపా దేశం నుంచి అరుదైన గౌరవం
* చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3 ప్రయోగంతో సర్వత్రా ప్రశంసలు
జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ను విజయవంతంగా దింపి అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించింది ఇస్రో. ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధ సంస్థపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా, మన శాస్త్రవేత్తల ప్రతిభను ఐరోపా దేశం గుర్తించి, అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. 
 
చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని విజయవంతం నిర్వహించినందుకు ఐస్‌లాండ్‌లోని హుసావిక్‌లో గల ఎక్స్‌ప్లొరేషన్‌ మ్యూజియం ‘2023 లీఫ్‌ ఎరిక్‌సన్‌ లూనార్‌ ప్రైజ్‌’ను అందజేసింది.  ‘చంద్రుడి గురించి అన్వేషణను ముందుకు తీసుకువెళ్లడం, ఖగోళ రహస్యాల ఛేదనలో ఇస్రో తిరుగులేని స్ఫూర్తిని ప్రదర్శించింది’ అని ఐస్‌లాండ్‌ రాజధాని రెయ్‌కావిక్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. 
 
ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యాం ఈ అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా ఐస్‌లాండ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఓ వీడియో సందేశం పంపారు. కాగా, లీఫ్ ఎరిక్‌సన్ అవార్డును ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియమ్ 2015 నుంచి అందజేస్తోంది. 
 
క్రిస్టోఫర్ కొలంబస్ యాత్రకు దాదాపు నాలుగు శతాబ్దాల ముందు అమెరికాపై అడుగు పెట్టిన మొదటి యూరోపియన్ అన్వేషకుడు లీఫ్ ఎరిక్సన్ పేరును ఈ అవార్డుకు పెట్టారు.  చంద్రుడిపై పరిశోధనలకు భారత్ చేపట్టిన మిషన్లలో చంద్రయాన్-3 మూడోది. మొదటిసారిగా 2008 అక్టోబరులో చంద్రయాన్‌ను ప్రయోగించింది. 
 

ఈ మిషన్‌ చంద్రుడికి 100 కి.మీ. దూరం నుంచి జాబిల్లి ఉపరితలాన్ని త్రీడీలో చిత్రీకరించడం, వివిధ ఖనిజాలు వాటి రసాయనిక సమ్మేళనాలు, రేడియో ధార్మికతను, న్యూక్లియడ్ల పంపకాలు, వాటి ప్రక్రియల అధ్యయనం కొరకు రిమోట్ సెన్సింగ్ పేలోడ్‌ సెట్‌లను ఉపయోగించారు. ఈ మిషన్ విజయవంతం కావడంతో 2019లో చంద్రయాన్-2ను చేపట్టారు.

అయితే, అత్యంత క్లిష్టమైన వాతావరణం ఉండే జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ సాగింది. చివరి మెట్టుపై ఇది విఫలమైంది. ఉపరితలంపై దిగుతూ క్రాష్ ల్యాండింగ్ అయి కూలిపోయింది. దీంతో మూడో మిషన్ చంద్రయాన్-3ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.  ఈ ఏడాది జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించారు. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను ఆగస్టు 23న ఇస్రో విజయవంతంగా దింపింది. ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకొచ్చి రెండు వారాల పాటు పరిశోధనలు సాగించింది.

 
  అలాగే, చంద్రుడి కక్ష్యలోని చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా తీసుకొచ్చి మరో ఘనత సాధించింది. ఇందులోని అదనంగా ఉన్న 100 కిలోల ఇంధనం ద్వారా తదుపరి లూనార్ ప్రయోగాలకు వినియోగించనున్నారు.