లాలూ యాదవ్, తేజస్విలకు ఈడీ సమన్లు

లాలూ యాదవ్, తేజస్విలకు ఈడీ సమన్లు
ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న తేజస్విని, 27న లాలూను తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
 
2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్‌ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. 
 
ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్‌లోని వివిధ రైల్వే జోన్స్‌లో కొంత మంది పాట్నా నివాసితులకు ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థులు లాలూ కుటుంబానికి చాలా తక్కువ ధరలకు భూమిని అమ్మినట్లు అభియోగాలు మోపాయి. అయితే ఈ ఆరోపణలను లాలూ కుటుంబం ఖండించింది.
 
కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ రెండు నెలల కిందట రెండో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే లాలూ యాదవ్, ఆయన భార్య, బీహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అక్టోబర్‌లో వారికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ మంజూరైన రెండు నెలల తర్వాత లాలూ, తేజస్వికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.