అయోధ్యకు ఎయిర్‌ ఇండియా విమానాలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈనెల 30వ తేదీన ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం నడపనున్నట్లు వెల్లడించింది. 
 
ఆ తర్వాత జనవరి 16 నుంచి ఈ మార్గంలో ప్రయాణికులకు రోజువారీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.  IX 2789 విమానం డిసెంబర్‌ 30న ఉదయం 11గంటలకు ఢిల్లీలో బయల్దేరి, మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇక అదేరోజు మధ్యాహ్నం 12:50 గంటలకు IX 1769 విమానం అయోధ్యలో బయల్దేరి మధ్యాహ్నం 2:10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని వివరించింది. మరోవైపు, ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్‌ 30న తొలిసారి విమానం నడపనున్నట్లు ఇప్పటికే ఇండిగో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 6 నుంచి రోజువారీ సర్వీసులు ప్రారంభిస్తామని ఇండిగో వెల్లడించింది.