
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ”పార్లమెంటు కాంప్లెక్స్‌లో ఉప రాష్ట్రపతిని చిన్నబుచ్చే విధంగా వ్యవహరించిన తీరు నన్ను అసంతృప్తికి గురిచేసింది. ఎన్నికైన ప్రతినిధులు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేయవచ్చు, అయితే అవి హుందాగా, గౌరవప్రదంగా ఉండాలి” అని ద్రౌపది ముర్ము ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పార్లమెంటు ఆవరణలో జరిగిన సంఘటనపై రాజ్యసభలో ధన్‌ఖడ్ మాట్లాడుతూ, జగ్దీప్ ధన్‌ఖడ్‌ను (తనను) ఎంతగా అవమానించినా లెక్కచేయనని, అయితే రైతు కులానికి చెందిన ఉపరాష్ట్రపతిని అమానించడం సహించలేనని స్పష్టం చేశారు. సభా గౌరవాన్ని కాపాడటం తన బాధ్యత అని చెప్పారు.
ఈ నేపథ్యంలో బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్‌కడ్‌కు సంఘీభావం ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో గంటపాటు ఎన్డీఎకు చెందిన ఎంపిలు నిలబడి రాజ్యసభ చైర్మన్ ధన్ కడ్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో మాట్లాడుతూ, ”ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు” అంటూ ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు.
“మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం” అని తెలిపారు. “వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం” అని ప్రకటించారు.
20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నా
మాక్ పార్లమెంట్ ఘటన దురదృష్టకరమని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఆ ఘటన పట్ల బాధను వ్యక్తం చేసిన ప్రధాని రాజ్యసభ చైర్మెన్ జగదీప్‌కు ఫోన్ చేసి తన విచారాన్ని తెలిపారు. 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలు తాను ఎదుర్కొన్నానని, ఇంకా అలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.
రాజ్యాంగబద్దమైన స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తులకు, అది కూడా పార్లమెంట్‌లో అవమానం జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ పేరోన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫోన్‌లో వెల్లడించినట్లు ధన్‌కర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించారు. అయితే, ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరు అని ప్రధానికి ఫోన్‌లో చెప్పిటన్లు చైర్మెన్ ధన్‌కర్ తెలిపారు.
కాగా, ఈ వివాదంపై టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందిస్తూ తన చర్య వెనుక ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ధన్‌ఖడ్ తనకంటే సీనియర్ అని, లాయర్లుగా తాము ఒకే ప్రొఫెషన్‍లో కొనసాగామని చెప్పారు. ”నేను చేసిన పేరడీ చూసి ఆయన (ధన్‌ఖడ్) భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? అది ఆయనను ఉద్దేశించినదేనని అనుకుంటే రాజ్యసభలో ఆయన అలాగ ప్రవర్తించారా? అనేదే నా ప్రశ్న” అని బెనర్జీ పేర్కొన్నారు.
అసలేమీ జరిగింది?
ఎంపీల సస్పెన్షన్ పరిణామం అనంతరం పార్లమెంటు వెలుపల మంగళవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌ను ఉద్దేశించేలా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరణ చేశారు.
ఆయన గొంతును అనుకరిస్తూ విచిత్రంగా ప్రవర్తించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా రాహుల్ గాంధీ ఆ దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించారు. దీనిపై ధన్‌కడ్ మండిపడుతూ ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
ఐఎస్ఐ కోసం గూఢచర్యంలో యూట్యూబర్ వసీం అరెస్ట్