అధ్యక్ష పదవికి ట్రంప్‌ను అనర్హుడిగా `సుప్రీం’ తీర్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్‌ను అన‌ర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేశారు.  2021, జ‌న‌వ‌రి ఆరో తేదీన జ‌రిగిన క్యాపిట‌ల్ హిల్ పై అతని మద్దతుదారులు చేసిన దాడిలో డొనాల్డ్ ట్రంప్ పాత్రను నిర్ధారిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. 

అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 నవంబర్/డిసెంబర్‌ నెలల్లో అక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాల తరువాత ప్రతి జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి.. పోటీలో ఉన్నారు. 

ప్రీపోల్ సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తూ వస్తోన్నారు. పలు రాష్ట్రాల్లో జో బైడెన్ కంటే కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైపే అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొలరాడో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువడించింది. డొనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది.  అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అయన అనర్హుడని ప్రకటించింది. దీనికి గల కారణాలను వెల్లడించింది సుప్రీంకోర్టు. 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరిపించిన కారణంగా అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్‌ అనర్హుడని ప్రకటిస్తూ కొలరాడో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.  అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఓ వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ సెక్షన్‌ 3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించడం మొదటిసారి. అయితే, ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని కోర్టు ట్రంప్‌నకు కల్పించింది. జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు.  అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డొనాల్డ్ ట్రంప్‌ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6వ తేదీన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వాషింగ్టన్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ర్యాలీ సందర్భంగా మద్దతుదారులు యూఎస్ పార్లమెంట్ భవనంపై దాడి చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు.
 
 దీనికి కారకుడు ట్రంప్ అని కొలరాడో సుప్రీంకోర్టు గుర్తించింది. ఏడుమంది న్యాయమూర్తులు గల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువడించింది. ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశించింది. అయితే, ఆయనకు ఊరటను సైతం కల్పించింది సుప్రీంకోర్టు.
ఈ తీర్పు కొలరాడో స్టేట్ వరకు మాత్రమే పరిమితమౌతుందని ప్రకటించింది. అంటే కొలరాడో స్టేట్‌లో జరిగే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఇక కనిపించదు. మిగిలిన రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. అక్కడ ఆయన పోటీ చేయవచ్చు. ఈ తీర్పుపై ఏడుమంది న్యాయమూర్తులు గల ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాలేదు. ముగ్గురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు. నలుగురు ట్రంప్ నిషేధానికి మొగ్గు చూపారు. మెజారిటీ సభ్యులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో తీర్పు వెలువడింది.