
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు, రాజకీయ నేతలు ఘనస్వాగతం పలికారు.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలో బస చేస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారం చేరుకున్నారు. ఐదు రోజుల పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి బస చేసే సమయంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నారు. బొల్లారం రాష్ట్రపతి నివాసం పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 20న భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు.
ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ వెళ్తారు.
రాష్ట్రపతి షెడ్యూల్
- డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
- డిసెంబర్ 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌తో పాటు థీమ్ పెవిలియన్‌ను రాష్ట్రపతి ముర్ము సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో కూడా సంభాషించనున్నారు.
- అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో రాష్ట్రపతి ఎంఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
- డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
- డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి