అక్రమ పశువుల రవాణా ముఠా పట్టివేత

అక్రమ పశువుల రవాణా ముఠా పట్టివేత

అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మూడు డీసీఎం వ్యానుల్లో తరలిస్తున్న 68 ఆవులు, ఎద్దులను స్వాధీనం చేసుకోవడంతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్  వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన కల్ల కృష్ణ, కొత్తగూడెం ప్రియదర్శిని నగర్ కు చెందిన అజీమ్ ఇద్దరూ కలిసి హైదరాబాద్ బహదూర్ పురాకు చెందిన మహమ్మద్ అష్ఫఖుద్దీన్ తో కలిసి అక్రమ తరలింపు దందాకు తెరలేపారు. కొత్తగూడెం, చర్ల చుట్టపక్కల ప్రాంతాల నుంచి ఆవులు, ఎద్దులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ ధరతో హైదరాబాద్ బహదూర్పురాకు తరలించేవారు. 

కొంతకాలంగా ఈ దందా సాగిస్తున్నారు. కాగా ఎప్పటిలాగే గురువారం కూడా పెద్ద మొత్తంలో మూగజీవులను తరలించేందుకు ప్లాన్ చేశారు. కొత్తగూడెం, చర్ల నుంచి దాదాపు 68 మూగజీవాలను మూడు డీసీఎంలలో కుక్కారు. వీటిని హైదరాబాద్ బహదూర్ పురకు తరలించాల్సి ఉండగా, పోలీసుల కంట పడకుండా వాళ్లంతా పెద్ద ప్లానే వేశారు. 

 ముందు అష్ఫఖుద్దీన్ కారు ఎస్కార్ట్ గా వెళ్తుండగా, ఆ వెనుకాల మూడు డీసీఎంలు ఫాలో అవుతూ వచ్చాయి. మూగజీవాలను ఇష్టారీతిన డీసీఎంలలో కుక్కి తీసుకువస్తుండగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారంఅందడంతో జనగామ జిల్లా రఘునాథపల్లి, కోమల్ల టోల్ గేట్ వద్ద కాపు కాశారు.  ముందస్తు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు టోల్గేట్ వద్దకు చేరుకోగా ముందుగా ఎస్కార్ట్ గా వచ్చిన అష్ఫఖుద్దీన్ పోలీసులను చూసి కారులో మరో ఇద్దరితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆ వెనుకే వచ్చిన డీసీఎంలను పోలీసులు పట్టుకున్నారు. డీసీఎంలలో ఉన్న వారిని విచారించగా మూగజీవాలన్నింటినీ గోవధ శాలలకే తరలిస్తున్నట్టుగా ఒప్పుకున్నారు. దీంతో వారి నుంచి వివరాలు సేకరించి 68 మూగజీవాలు, ఆరు సెల్ ఫోన్లు, మూడు డీసీఎంలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం రఘునాథపల్లి పోలీసులకు అప్పగించారు.