రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా  భజన్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వాల ప్రమాణం చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
 
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, నితిన్‌ గడ్కరీతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక రాజస్థాన్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాత్‌ తదితరులు హాజరయ్యారు.
 
పార్టీ కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సరోజ్‌ పాండే, వినోద్‌ తావ్డే సమక్షంలో మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో భజన్‌లాల్‌ శర్మను ముఖ్యమంత్రిగా నియమించారు. సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి జరిగిన ఎన్నికల్లో భజన్ లాల్ శర్మ 48,000 ఓట్ల ఆధిక్యతతో మొదటిసారి శాసనసభకు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 97,081 ఓట్లు రాగా, ఆయనకు 1,45,162 ఓట్లు వచ్చాయి.  మొత్తం 200 సీట్లు గల అసెంబ్లీలో 199 సీట్లకు ఎన్నికలు జరుగగా బీజేపీకి 115 సీట్లు, కాంగ్రెస్ 69 సీట్లు గెలుచుకున్నాయి.

భజన్‌లాల్‌ ఆరెస్సెస్‌, ఏబీవీపీ, బీజేవైఎంలో పనిచేశారు. భరత్‌పూర్‌లోని అటారీ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో భజన్‌లాల్ (56) జన్మించారు. ఈయన రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. నాలుగుసార్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1992లో అయోధ్య రామమందిర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. తాను పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చేశానని ఎన్నికల అఫిడవిట్ లో భజన్ లాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాపారాన్ని నడుపుతున్నారు.

ఉపముఖ్యమంత్రి దియాకుమారి జైపూర్‌ను పాలించిన చిట్టచివరి మహారాజు మాన్ సింగ్-2 మనుమరాలు. 2013లో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. 2013లో సవాయ్ మథోపూర్‌ నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ జర్నీ విజయవంతంగా మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దేవకినందన్ కాకాపై 5,51,916 ఓట్ల భారీ ఆధిక్యంతో అఖండ విజయం సాధించింది. దీంతో ఆమె పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.