తెలంగాణ ఉద్యమకారులకు స్వేఛ్చ

తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు, పోరాటాలు చేసిన ఉద్యమ కారులకు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. త్వరలోనే ఉద్యమ కారులపై నమోదైన కేసులను ఎత్తేయాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు 2009 డిసెంబర్ 9 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసుల వివరాలను తమకు అందించాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను సీఎం రేవంత్ కోరారు. ఆ వివరాలను బట్టి ప్రభుత్వం త్వరలోనే కేసులు ఎత్తేయనుంది. ఇక ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకు వీలుగా ఈ కసరత్తు చేపట్టినట్లు సమాచారం.

కాగా ఉద్యమ సమయంలో వేలాది మందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఇన్నేళ్లైనా ఆ కేసులు ఇప్పటికి అలాగే ఉన్నాయి. దీంతో చాలామందికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజారిపోయాయి. తాజా నిర్ణయంతో ఉద్యమకారులు కేసుల నుంచి విముక్తి కానున్నారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ఉద్యమకారులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్న తమవాళ్లపై పెట్టిన కేసులు ఇంకా రద్దు చేయకపోవడంతో కుటుంబసభ్యులు ఇన్నాళ్లు బాధపడ్డారు. తాజాగా కొత్త ప్రభుత్వం ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకోవడం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంది.

సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులపై అప్పట్లో నమోదైన కేసుల వివరాల్ని పోలీస్‌ శాఖ సేకరిస్తోంది. ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకు వీలుగా ఈ కసరత్తు చేపట్టినట్లు సమాచారం. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల వివరాల్ని అందజేయాలని కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ కార్యాలయం ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ చీఫ్‌ కార్యాలయం నుంచి శుక్రవారం కమిషనర్లు, ఎస్పీలకు ఫ్యాక్స్‌ ద్వారా సందేశాలను పంపించారు

దీనికోసం తొమ్మిది అంశాలతో పోలీస్ శాఖ ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. స్థానిక పోలీస్‌ స్టేషన్ల నుంచి వివరాలు సేకరించి కమిషనర్లు, ఎస్పీలు సీఐడీ విభాగానికి అందజేయాలని పేర్కొన్నారు. దీనికోసం సీఐడీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఇద్దరు అధికారులకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద పదేళ్ళుగా కేసులతో సతమతం అవుతున్న తెలంగాణ ఉద్యమకారులు త్వరలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్నారు.