శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు సాధించారు. దేశంలో మొత్తం నలుగురికి ఈ జాబితాలో చోటు దక్కగా అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు. 
ఇక వరుసగా ఐదో సంవత్సరం ఈ జాబితాలో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం. 
శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్‌ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె 2022లో 36వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 32వ స్థానంలో ఐదోసారి చోటు దక్కించుకోవడం విశేషం.
 
సీతారామన్ ను భారతదేశపు మొట్టమొదటి పూర్తికాలపు మహిళా ఆర్థిక మంత్రి అనిఎం  ఆమె రాజకీయ ప్రవేశానికి ముందు ఇంగ్లాండ్ కేంద్రంగా పనిచేసే అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్, బిబిసి వరల్డ్ సర్వీస్‌లలో ఆమె పనిచేశారని ఫోర్బ్స్ పేర్కొన్నది.  ఇక ఈ జాబితాలో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్నీ నడార్ మల్హోత్రా 60వ స్థానంలో నిలిచారు.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76 స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టీన్ లగార్డ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
జూలై 2020లో తన తండ్రి నుండి హెచ్‌సిఎల్ చైర్‌పర్సన్ పాత్రను స్వీకరించిన రోష్ని నాడార్ మల్హోత్రా కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, వన్యప్రాణులు, సంరక్షణపై ఆమెకు మక్కువ.  ఆమె శిఖర్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు.
 
సోమా మొండల్ జనవరి 2021లో పోస్ట్‌ని స్వీకరించినప్పుడు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సెయిల్‌కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ అయ్యారు.  ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అల్యూమినియం కంపెనీలో చేరింది. ఆ కంపెనీని లాభాలవైపు నడిపించడంతో పాటు, మొదటి సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయి.
 
భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 92వ స్థానంలో ఉన్న కిరణ్ మజుందార్-షా 1978లో బయోకాన్ అనే బయోఫార్మాస్యూటికల్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లాభదాయకమైన అమెరికా మార్కెట్‌లోకి విజయవంతంగా ప్రవేశించిందని ఆమె ఫోర్బ్స్ ప్రొఫైల్ తెలిపింది.