దేశంలో నిరుద్యోగులు, చిన్నా చితకా వ్యాపారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వందకు పైగా వెబ్ సైట్లను నిలిపేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పలు రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్న, విదేశీ వెబ్ సైట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ ఏదో ఒక రూపంలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఆన్ లైన్ వర్క్స్, పెట్టుబడులు ఆఫర్ చేస్తున్నవే. వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, పార్ట్ టైమ్ జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కు పైగా వెబ్‌సైట్‌లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఈ వెబ్‌సైట్‌లు విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు కేంద్రం నిర్ధారించింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన వర్టికల్ నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్లోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గత వారం ఈ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని గుర్తించి సిఫార్సు చేసింది. ఇవన్నీ మోసపూరిత పెట్టుబడి పథకాలు, పార్ట్ టైమ్ జాబ్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఐటీ చట్టం 2000 ప్రకారం ఈ సిఫార్సును అనుసరించి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది.
ఈ వెబ్‌సైట్‌లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, మోసపూరిత పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌లు ఇస్తున్నట్లు తేల్చారు. విదేశాలకు చెందిన వ్యక్తులచే నిర్వహించబడుతున్న ఈ ప్లాట్‌ఫారమ్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్‌లు, అద్దె ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
కార్డ్ నెట్‌వర్క్‌లు, క్రిప్టోకరెన్సీలు, విదేశీ ఏటీఎం విత్ డ్రాయల్స్, అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీల వంటి వివిధ మార్గాల ద్వారా ఈ ఆర్థిక నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారతదేశం నుండి మనీ లాండరింగ్ చేస్తున్నారని హోంశాఖ ప్రకటనలో తెలిపింది. ఈ వెబ్‌సైట్‌లు గూగుల్, మెటా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ‘ఇంట్లోనే ఉంటూ సంపాదించడం ఎలా’ వంటి ప్రకటనలతో రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నట్లు తెలిపింది.
యాడ్స్ క్లిక్ చేయగానే.. వారి ఏజెంట్లు వాట్సప్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల్లో యూజర్లతో మాట్లాడుతారు. వీడియోలు లైక్ చేయడం, సబ్‌స్క్రైబ్ చేయడం, రేటింగ్ ఇవ్వడం వంటి టాస్క్‌లు చేయాల్సిందిగా బాధితులను ట్రాక్ చేస్తారు. మొదట్లో టాస్క్ పూర్తి చేసిన తర్వాత కొంత కమిషన్ ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టాలని .. దీంతో మరింత అధిక ఆదాయం పొందవచ్చని ఆశచూపుతారు.
దీంతో బాధితులు అధిక మొత్తాన్ని డిపాజిట్ చేసినపుడు వారి డిపాజిట్లను నిలిపివేస్తుంటారు. దీంతో తాము మోసపోయామని బాధితులకు తెలుస్తుందని ఎంహెచ్‌ఎ తెలిపింది. అయితే, ఈ వెబ్‌సైట్ల వివరాలను వెల్లడించలేదు.
More Stories
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి