తెలంగాణాలో 64 స్థానాలు గెలుచుకోగానే ప్రభుత్వం ఏర్పాటుకు హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీలో అకస్మాత్తుగా ప్రతిష్టంభన ఏర్పడింది. సోమవారం రాత్రి 8.30 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంకు రాజ్ భవన్ లో అన్ని ఏర్పాట్లు జరిగి, కాంగ్రెస్ శ్రేణులు అక్కడకు చేరుకోవడం ప్రారంభమైన తర్వాత అకస్మాత్తుగా పార్టీ పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి ప్రయాణం కావడంతో కార్యక్రమం వాయిదా పడింది.
ఉదయమే సీఎల్పీ సమావేశం జరిపి, సిఎల్సీ నేత ఎంపిక నిర్ణయాన్ని ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సిఎల్సీ చేసిన ఏక వాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపారు. మధ్యాహ్నంకే ఢిల్లీ నుండి కాబోయే ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారని ఆశించారు. సిఎల్సీ అధినేతను డిల్లీ పెద్దలు ఖరారు చేయకపోవడంతో ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది.
పైగా, డికె,శివకుమార్ తో సహా తెలంగాణ పరిశీలకులుగా ఉన్న వారందర్ని తక్షణం ఢిల్లీకి రావాలని పిలుపు రావడతో కార్యక్రమం వాయిదా పడింది. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎంపిక పట్ల ఏకాభిప్రాయం వ్యక్తమైన్నట్లు చెబుతున్నా పార్టీ సీనియర్లు ఆయనతప్ప మరెవరైనా సరే అంటున్నట్లు తెలుస్తున్నది.
ఈ సందర్భంగా మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేరును స్వయంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రతిపాదిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డి పట్ల పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. మరోవంక, ఉపముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రిత్వ శాఖల విషయంలో సహితం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు.7వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.
రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, సీతక్క డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతోంది. అయితే, కర్ణాటకలో మాదిరిగా ఒకరే ఉపముఖ్యమంత్రిగా ఉండాలని విక్రమార్క పట్టుబడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అదే విధంగా స్పీకర్ పదవి చేపట్టేందుకు పలువురు ముందుకు రావడంలేదని తెలుస్తున్నది.
ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఉత్తరాదిన మూడు రాష్ట్రాలలో పార్టీ ఓటమి గురించిన సమీక్షలతో మునిగిపోయి తెలంగాణ గురించి పట్టించుకొనే తీరిక లేకపోయిందని చెబుతున్నారు. మరోవంక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ జారీచేసింది.
ఈ గెజిట్ నోటిఫికేషన్ ను సీఈవో వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ కు అందజేశారు. దీంతో పాటు ఎన్నికల ఫలితాలపై నివేదిక అందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందించారు సీఈవో వికాస్ రాజ్. మంత్రివర్గ సిఫార్సు మేరకు తెలంగాణ రెండో శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణం కావడంతో సోమవారం నాటికి ఎన్నికల కోడ్ ముగిసింది. దానితో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ పరిపాలన కొనసాగనుంది. భారత ఎన్నికల కమిషన్ అక్టోబర్ 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్‌ను వెలువరించిన మరు క్షణం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రెడ్ కారిడార్: అశాంతి ముగింపుకు భారతదేశ సుదీర్ఘ యుద్ధం
తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతి కేంద్రం