మిజోరంలో ప్రతిపక్షం జడ్‌పిఎం గెలుపు

ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మాజీ ఐపీఎస్ అధికారి లాల్ దహోమా (74) నాయకత్వంలోని ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూమెంట్ (జడ్‌పిఎం) 27 సీట్లను గెల్చుకొని అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. అక్కడ అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.  షెడ్యూల్ ప్రకారమే మిగతా నాలుగు రాష్ట్రాలతో కలిసి డిసెంబరు 3నే ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. 
 
కానీ, క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన రోజున లెక్కింపు చేపట్టవద్దని కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తులను పరిగణనలోకి తీసుకుని డిసెంబరు 4కు ఈసీ వాయిదా వేసింది. ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జడ్‌పిఎం) పార్టీ భారీ విజయం సాధించింది. ఐపీఎస్ అధికారిగా గోవాలో పనిచేసి, ఆ తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ వద్ద భద్రత అధికారిగా పనిచేశారు. 
 
ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున 1984లో లోక్‌సభలో అడుగుపెట్టారు. అనంతరం పార్టీని వీడి భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టంపై డిశ్చార్జ్ అయిన మొదటి ఎంపీగా నిలిచారు.  అనంతరం 2017లో జోరం నేషనలిస్ట్ పార్టీ స్థాపించి, ఆ తర్వాత జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌ కూటమిలో చేరారు. 2018లో ఆ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రస్తుత ఎన్నికల్లో తన పార్టీని అధికారం దిశగా నడిపిస్తున్నారు.
 
ముఖ్యమంత్రి  జొరాంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌)  పరాజయాన్ని మూటగట్టుకున్నది. 10 స్థానాలను కైవసం చేసుకొని ప్రతిపక్షంగా మారింది. జోర‌మ‌తంగ స్వయంగా రెండు వేల ఓట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూశారు. ఐజ్వాల్ ఈస్ట్‌-1 స్థానం నుంచి పోటీ చేసిన జెడ్‌పీఎం అభ్య‌ర్థి లాల్‌త‌న్ సంగ విజ‌యం సాధించారు.
 
జాతీయ పార్టీలైన బిజెపి రెండు సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి. మిజోరాంలో వరుసగా రెండోసారి అధికార పార్టీకి ఓటర్లు పట్టం కట్టే సంప్రదాయం కొనసాగుతుంది. కానీ, ఈసారి ఆ సంప్రదాయాన్ని అధిగమించి లాల్దుహోమా నేతృత్వంలోని జెడ్‌పీఎం అధికారం చేబట్టబోతుంది. 
 
ఆదివారం ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాల్లో కూడా మూడు చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణలో  ఇన్నాళ్లు విపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ బిఆర్ఎస్ ను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మధ్యప్రదేశ్‌లో మాత్రమే తిరిగి బీజేపీకే అక్కడి ప్రజలు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టారు. దీంతో ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మిగిలిన  మిజోరంలో కూడా ప్రతిపక్షానికే ఓటర్లు పట్టంకట్టారు.