మిచౌంగ్‌ తుఫాన్‌ తో అతలాకుతలమైన చెన్నై నగరం

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుఫాన్‌ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని  ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఆదివారం రాత్రి నుంచి చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది.
దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  చెన్నై నగరంతోపాటు పొరుగున ఉన్న కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. 
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో చెన్నై నగరంతోపాటు దాని పొరుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తగా పాఠశాలలు, కళాశాలలు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.

ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్ డి ఆర్ ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ డి ఆర్ ఎఫ్) బృందాలు చెన్నైలో మోహరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి.

దీంతో ప్రమాదకర స్థాయిని మించి నీరు ప్రవహిస్తున్న దృష్ట్యా బేసిన్‌ బ్రిడ్జ్‌ – వ్యాసర్పాడి మధ్య ఉన్న బ్రిడ్జి నెంబర్‌ 14ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వంతెన మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

చెన్నై – మైసూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు – కోవై ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కెఎస్‌ఆర్ బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, కెఎస్‌ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను సోమవారం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు.

చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేష‌న్‌లోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుకున్న‌ది. పుదుచ్చేరిలోని తీర ప్రాంతంలో 144వ సెక్ష‌న్‌ను విధించారు. రాత్రి 7 నుంచి ఉద‌యం 6 వ‌ర‌కు తీరం వెంట నిషేధం విధించారు.

ఐఎండీ ప్రకారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వలసరవక్కంలో 154.2 మి.మీటర్ల వర్షంపాతం నమోదు కాగా, నుంగంబాక్కంలో 101.7 మి.మీ, షోలింగనల్లూర్‌లో 125.7 మి.మీ, కోడంబాక్కంలో 123.3 మి.మీ, మీనంబాక్కంలో 108 మి.మీ వర్షపాతం నమోదైంది.