సౌర గాలులపై ఆదిత్య ఎల్1 అధ్యయనం ప్రారంభం

సౌర గాలులపై ఆదిత్య ఎల్1 అధ్యయనం ప్రారంభం

సూర్యుడి గురించి అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా చేపట్టిన ఆదిత్య ఎల్1 మిషన్ తన ప్రయాణంలో మరో కీలక మైలురాయికి చేరుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించినట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాల పరిశోధనలు కొనసాగుతున్నాయని, సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని పేర్కొంది.

ప్ర‌స్తుతం సోలార్ పేలోడ్ త‌న ఆప‌రేష‌న్స్ స‌క్ర‌మంగా చేస్తున్న‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది.  విండ్ పార్టిక‌ల్ ఎక్స్‌ప‌రిమెంట్‌లో రెండు ప‌రిక‌రాలు ఉన్నాయి. దాంట్లో సోలార్ విండ్ ఐయాన్ స్పెక్ట్రోమీట‌ర్‌, సూప్రా థ‌ర్మ‌ల్ అండ్ ఎన‌ర్జిటిక్ పార్టిక‌ల్ స్పెక్ట్రోమీట‌ర్ ఉన్నాయి. సూప్రా థ‌ర్మ‌ల్ ప‌రిక‌రం సెప్టెబ‌ర్ 10వ తేదీ నుంచి యాక్ష‌న్‌లో ఉంది. ఇక ఐయాన్ స్పెక్ట్రోమీట‌ర్ శ‌నివార‌మే త‌న ప‌ని ప్రారంభించింది. స్పెక్ట్రోమీట‌ర్ ప‌నితీరు బాగానే ఉంద‌ని ఇస్రో చెప్పింది. 

ఆదిత్య పేలోడ్ ప‌రిక‌రం తీసిన ఫోటోను ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్స్‌లో ఉన్న ఎన‌ర్జీ తేడాల‌ను ఈ ఫోటోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. రెండు రోజుల్లో ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్ కౌంట్‌లో తేడా ఉన్న‌ట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ పరికరాల కార్యకలాపాలు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగుతున్నాయని ఇస్రో వెల్లడించిది. స్విస్‌లోని రెండు సెన్సార్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ సూర్యుడి గురించి పరిశీలిస్తున్నాయి. ఇవి గత నెలలోని రెండు తేదీల్లో సోలార్‌ విండ్‌ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్‌, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించినట్లు ఇస్రో తెలియజేసింది. 

ఈ సెన్సార్‌ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల లక్షణాలపై సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నో సందేహాలకు సమాధానాలు లభ్యమయ్యే అవకాశముందని ఇస్రో వివరించింది. 

అంతేగాక, సౌర గాలుల్లో అంతర్లీనంగా ఉండే ప్రక్రియలు, భూమిపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై సమగ్ర పరిశోధనలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపింది. అలాగే, లాగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద చోటుచేసుకునే కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎంఈ)పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది.

కాగా, సెప్టెంబరు 2న సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ‘ఆదిత్య – ఎల్‌ 1’ నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్‌1 పాయింట్‌‌లో ప్రవేశపెట్టే ప్రక్రియ వచ్చే జనవరి 7 నాటికి పూర్తవుతుందని ఇటీవల ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు.  భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ పాయింట్‌-1కి ఆదిత్య- ఎల్1 చేరుకున్న తర్వాత.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ నిరంతరం సూర్యుడ్ని అధ్యయనం చేస్తుంది.

అంతర్జాతీయ సైంటిఫిక్ కమ్యూనిటీ సేకరించిన డేటా అన్వేషణపై మరింత ఆసక్తి పెంచుతుండగా.. క్లిష్టమైన సౌర గాలులు, భూమిపై దాని ప్రభావాల గురించి విస్తృతమైన సమాచారం ఆవిష్కరించడానికి ASPEX సిద్ధంగా ఉంది.  ఈ పరిశోధనలు సౌర దృగ్విషయాలపై మన అవగాహనకు గణనీయంగా దోహదపడతాయని, అంతరిక్ష వాతావరణ అంచనా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.