నవంబర్‌లో రూ. 1.67 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు నవంబర్‌ మాసంలో 15 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ మాసంలో వసూలైన రూ.1,67,929 కోట్ల మొత్తంలో సీజీఎస్‌టీ నుంచి రూ.30,420 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ నుంచి రూ.38,226 కోట్లు, ఐజీఎస్‌టీ నుంచి రూ.87,009 కోట్లు (సరకు దిగుమతి వసూళ్లు రూ.39,198 కోట్లతో కలిపి), సెస్ రూ.12,274 కోట్లు (సరుకు దిగుమతి వసూళ్లు రూ.1,036 కోట్లతో కలిపి) ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.

‘నవంబర్ నెలలో దేశవాళీ ట్రాన్సాక్షన్ల ద్వారా (దిగుమతి సేవలతో సహా) వసూలైన రెవెన్యూ గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 20 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.60 లక్షల కోట్ల మార్క్‌ను దాటి జీఎస్‌టీ వసూళ్లు రావడం ఇది ఆరోసారి” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  గత అక్టోబర్‌లో జీఎస్‌టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.1,72,003 కోట్లు వసూలైంది. ఏప్రిల్ 2023లో అత్యథికంగా రూ.1,87,035 కోట్లు వసూలయ్యాయి.

నవంబర్‌లో సీజీఎస్టీ వసూళ్లు రూ.30,400 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.38,200 కోట్లు. ఇది కాకుండా నవంబర్‌లో ఐజీఎస్టీ వసూళ్లు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గత 7 నెలల్లో మొత్తం రూ.1.6 లక్షల కోట్ల వసూళ్ల మార్కును జీఎస్టీ 5 సార్లు నమోదు చేసింది.  ఇదే క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే రూ.1.67 లక్షల కోట్లుగా నమోదైంది. కరోనా తర్వాత నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరగటంతో 2022-23లో సగటున రూ.1.51 లక్షల కోట్ల మేర పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం తెలుస్తోంది.