దేశ వ్యాప్తంగా మరో 25 వేల జనఔషధీ కేంద్రాలు

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఇవాళ (నవంబర్-30) లబ్దిదారులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా లబ్దిపొందుతున్న వారి అనుభవాలను సేకరించారు. ఏ ఏ కార్యక్రమాల ద్వారా.. ఎలాంటి ప్రయోజనాలు పొందారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలోని జనఔషధీ కేంద్రాల సంఖ్యను పది వేల నుంచి 25 వేలకు పెంచారు. ఈ కార్యక్రమాన్ని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.
గ్రామాల్లో జనఔషధీ కేంద్రాలను నిర్వహిస్తున్న వాలంటీర్లు.. ప్రజలకు పూర్తిస్థాయిలో ఔషధాలు అందేలా చూడాలని ఈ సందర్బంగా ప్రధాని కోరారు. ఆరోగ్య సంరక్షణ అనేది అందరికీ సులభంగా అందుబాటులో ఉండాలని.. అప్పుడే ఆరోగ్యకరమైన భారత్ ను ఆవిష్కరించవచ్చు అని అన్నారు.
అలాగే మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇదే విషయంపై ఓ లబ్దిదారుడితో మాట్లాడుతూ, డ్రోన్ పథకం గురించి చాలా మందికి సందేహాలు ఉన్నప్పటికీ, ఇది మహిళలకు సాధికారతనిస్తుందని నిరూపించబడిందని మోడీ అన్నారు. ఈ కార్యక్రమం కింద, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లు అందజేస్తారు. డ్రోన్లను ఎగరేయడానికి, వాటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన శిక్షణ కూడా మహిళలకు అందిస్తారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు.
అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఫార్మ్ మెషినరీ బ్యాంక్ స్కీమ్, కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి ప్రభుత్వ పథకాల ద్వారా జమ్మూ జిల్లాలోని అర్నియాకు చెందిన మహిళా రైతు బల్వీర్ కౌర్.. ట్రాక్టర్‌ను పొందినట్లు ప్రధానికి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ట్రాక్టర్ కొనుగోలు చేసినందుకు మోడీ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా “మీ దగ్గర ట్రాక్టర్ ఉంది, కానీ నా దగ్గర సైకిల్ కూడా లేదు.” అని సరదాగా ఆమెతో మోడీ అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందడంతో పాటు.. వాటిని పొరుగున ఉన్న పది గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయాలని ప్రధాని వాలంటీర్లకు సూచించారు. క్యూలో నిలబడిన చివరి వ్యక్తికి కూడా అన్ని ప్రయోజనాలు చేరుతాయన్న నమ్మకాన్ని కలిగించాలని మీటింగ్ లో పాల్గొన్న వారికి వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఖుంటి నుండి ప్రధాని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలకు, అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.