
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 521 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కాంగ్రెస్ కు చెందిన 85 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడైంది.
మొత్తం 2,290మంది అభ్యర్థులలో 355 మంది జాతీయ పార్టీలకు చెందినవారు కాగా, 175మంది ప్రాంతీయ పార్టీలకు, 771మంది గుర్తింపుపొందని పార్టీలకు చెందినవారు, మరో 989 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి చూస్తే, బీఆర్ఎస్ టికెట్ పై 119మంది పోటీలో ఉండగా 57మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
బీజేపి అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా 79మందిపైన, 118 స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులలో 85 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్ధులలో 45మందిపై మహిళలతో జరిగిన వివాదాలకు సంబంధించిన కేసులలో నిందితులుగా ఉన్నారు. వీరిలో ముగ్గురు అత్యాచార కేసులలో అభియోగాలు ఎదుర్కుంటున్నారు. ఇలా ఉండగా, ప్రాంతీయ పార్టీల అభ్యర్ధులలోకన్నా జాతీయ పార్టీల అభ్యర్థులలో ఎక్కువ మందికి నేరచరిత్ర ఉంది.
జాతీయ పార్టీలలో 355 మంది అభ్యర్థులలో 216 మందిపై (64 శాతం) క్రిమినల్ కేసులు ఉండగా, ప్రాంతీయ పార్టీలలో 175 మంది అభ్యర్థులలో 75 మందిపై (43 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే, జాతీయ పార్టీలలోకన్నా ప్రాంతీయ పార్టీల అభ్యర్థులలో సంపన్నులు ఎక్కువగా ఉన్నారు. జాతీయ పార్టీలలో 241 మంది ( 68 శాతం) కోటీశ్వరులు కాగా, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులలో 141 మంది ( 81 శాతం) మంది కోటీశ్వరులు ఉన్నారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?