బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ల నుంచి విముక్తి కోరుకొంటున్న ప్రజ‌లు

తెలంగాణ‌కు ఎప్పుడు వ‌చ్చినా రాష్ట్రంలో మార్పు కావాల‌నే ఆకాంక్ష ప్రజ‌ల్లో క‌నిపిస్తుంద‌ని చెబుతూ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నుంచి రాష్ట్ర ప్రజ‌లు విముక్తి కోరుకుంటున్నార‌ని, తెలంగాణ ప్రజ‌లు బీజేపీపై విశ్వాసం చూపుతున్నార‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కుటుంబ‌, అవినీతి పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పే స‌మ‌యం వ‌చ్చింద‌ని స్పష్టం చేశారు.
‘‘ఇక్కడ జన ప్రవాహం కనిపిస్తుంది. తొమ్మిదేళ్ల వారి పాలనపై ప్రజలు విసిగిపోయారు. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తి కోరుతున్నారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు” అని చెప్పారు. టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్‌గా మారిందని, యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారిపోయిందని ప్రధాని విమర్శించారు.
టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మార్చుకున్నంత మాత్రాన వారు చేసిన అవినీతి రూపుమాసిపోదని ఎద్దేవా చేశారు. అలాగే యూపీఏ నుంచి ‘ఇండియా’ అని మార్చుకున్నంత మాత్రాన వారి తీరు మారదని పేర్కొంటూ  బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కామన్ పాయింట్ అవినీతి అని ధ్వజమెత్తారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌ను, పీసీసీ చీఫ్ ఇద్దరిని ఓడించాల‌ని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ కుటుంబ‌, అవినీతి పాల‌న‌కు గుణ‌పాఠం చెప్పే అవ‌కాశం ఈ ప్రాంత ప్రజ‌ల‌కు దక్కింద‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 3వ తేదీన తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారును గ‌ద్దె దించాల‌ని కోరారు. 
 
బీజేపీ పేద‌ల కోసం ప‌ని చేస్తుందని, దేశంలో ఏ పేద‌వాడు ఆక‌లితో అల‌మ‌టించ‌కూడ‌దని మ‌రో ఐదేండ్లు ఉచిత రేష‌న్ అంద‌జేస్తున్నామ‌ని మోదీ తెలిపారు. దీంతో ఈ రాష్ట్రంలోని పేద‌ల‌కూ ప్రయోజ‌నం క‌లుగుతుంద‌ని చెప్పారు. స‌కల జ‌నుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ ల‌క్ష్యమ‌ని చెప్పారు.  అణ‌గారిన‌, వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసమే బీజేపీ సంక‌ల్ప్ ప‌త్రం సిద్ధం చేసింద‌ని స్పష్టం చేశారు. 
 
బీజేపీ చెప్పింది చేస్తుంద‌ని, జాతీయస్థాయిలో ప్రజ‌లు సైతం చూశార‌ని ప్రధాని తెలిపారు. తెలంగాణ‌లో పుసుపు బోర్డు ఏర్పాటు చేస్తామ‌ని వాగ్ధానం చేసి పూర్తి చేశామ‌ని చెప్పారు. అలాగే తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తుంద‌ని ప్రక‌టించామ‌ని, ఈ ప్రక‌ట‌న‌తో బీసీలు ఉత్సాహాంగా ఉన్నార‌ని చెప్పారు. ద‌ళితులను ముఖ్యమంత్రి చేస్తామ‌ని కేసీఆర్ ప్రక‌ట‌న చేసి, ద‌ళితులు ఓట్లు ద‌క్కాక సీఎం కూర్చీ కబ్జా చేశార‌ని ఆరోపించారు.
 
తెలంగాణ వికాస యాత్రలో మాదిగ సామాజిక త‌ర‌గ‌తికి అన్యాయం జ‌రిగింద‌న్న మోదీ.. ఆ అన్యాయాన్ని స‌వ‌రిచేందుకు కృత‌నిశ్చయంతో ఉన్నామ‌ని స్పష్టం చేశారు. ఇందుకోసం ఓ క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. మాదిగ‌ల స్వశ‌క్తీక‌ర‌ణ‌కు ఈ క‌మిటీ కొత్త దారి చూపుతుంద‌ని చెప్పారు.  తెలంగాణ స‌ర్కారు రైతుల‌ను మోసం చేసింద‌న్న మోదీ.. అనేక ఇరిగేషన్ ప‌థ‌కాలు బీఆర్ఎస్ స‌ర్కారుకు ఏటీఎంలా మారాయ‌ని ఆరోపించారు. 
తెలంగాణ స‌ర్కారు రైతుల‌ను మోసం చేసింద‌న్న మోదీ.. అనేక ఇరిగేషన్ ప‌థ‌కాలు బీఆర్ఎస్ స‌ర్కారుకు ఏటీఎంలా మారాయ‌ని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు డ‌బ్బులు అవ‌సర‌మైన ప్రతిసారీ ఓ కొత్త స్కీం ప్రక‌టిస్తున్నార‌ని విమ‌ర్శించారు.  బీజేపీ స‌ర్కారు కిసాన్ స‌మ్మాన్ నిధి పేరిట నేరుగా రైతుల‌కు న‌గ‌దు పంపిణీ చేస్తోంద‌ని, తెలంగాణ‌లో 40 ల‌క్షల మందికి రైతుల‌కు లాభం జ‌రిగింద‌ని మోదీ తెలిపారు. కామారెడ్డిలోనూ 1.5 ల‌క్షల మందికి ల‌బ్ధి జరిగింద‌ని చెప్పారు. 
 
తెలంగాణ‌ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ తీసుకుంటామ‌న్న ప్రధాన‌మంత్రి… ఈ ఖ‌రీప్‌లో అద‌నంగా 20 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని చెప్పారు. చెరుకు రైతులకు లాభం క‌లిగేలా ఇథ‌నాల్ ప‌రిశ్రమ‌లను ఏర్పాటు చేస్తున్నామ‌ని, దీంతో కామారెడ్డి రైతుల‌కు లాభం జ‌రుగుతుంద‌ని భరోసా ఇచ్చారు.