200 కోట్ల డాల‌ర్లు పెట్టుబ‌డులుకు టెస్లా సిద్ధం

భార‌త్‌లో ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పేందుకు భారీ పెట్టుబ‌డుల‌కు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన అమెరిక‌న్ ఎలక్ట్రిక్ కార్ త‌యారీ దిగ్గ‌జం టెస్లా అందుకు ఓ మెలిక పెట్టింది. భార‌త్‌లో రెండేండ్ల పాటు త‌న ఆప‌రేష‌న్స్‌కు దిగుమ‌తి చేసుకునే వాహ‌నాల‌పై త‌క్కువ క‌న్సెష‌న‌ల్ సుంకాల‌కు అనుమ‌తిస్తేనే భారీ పెట్టుబ‌డుల‌కు ముందుకొస్తామ‌ని టెస్లా పేర్కొంది. 

భార‌త్‌లో ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పేందుకు టెస్లా కొంత‌కాలంగా ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. తొలి రెండేండ్ల‌లో దిగుమ‌తి చేసుకున్న త‌మ వాహ‌నాల‌పై 15 శాతం క‌న్సెష‌న‌ల్ డ్యూటీకి ప్ర‌భుత్వం ఆమోదిస్తే 200 కోట్ల డాల‌ర్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మ‌ని టెస్లా పేర్కొంది. ఈ దిశ‌గా స‌మ‌గ్ర ప్ర‌తిపాద‌న‌తో టెస్లా ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించింది.

భార‌త్‌లో త‌మ పెట్టుబ‌డుల వివ‌రాలు, త‌క్కువ సుంకంపై ఎన్ని కార్ల‌ను దిగుమ‌తి చేస్తుంద‌నే వివ‌రాల‌ను ప్ర‌భుత్వం ముందుంచింది. టెస్లా ప్ర‌తిపాద‌న సాధ్యాసాధ్యాల‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌ని స‌మాచారం.  క‌న్సెష‌న‌ల్ టారిఫ్‌పై దిగుమ‌తి చేసే కార్ల సంఖ్యను టెస్లా ప్ర‌తిపాద‌న కంటే కుదించాల‌ని ప్ర‌భుత్వం కోరుకుంటోంద‌ని ఓ వార్తా సంస్ధ నివేదిక వెల్ల‌డించింది.

భార‌త్ ప్ర‌స్తుతం 40,000 డాల‌ర్ల‌కు పైబ‌డిన కార్ల‌పై 100 శాతం దిగుమ‌తి సుంకాన్ని విధిస్తుండ‌గా అంత‌కంటే త‌క్కువ ధ‌ర ప‌లికే కార్ల‌పై 70 శాతం దిగుమ‌తి సుంకం వ‌సూలు చేస్తోంది. దిగుమ‌తి సుంకంతో పాటు ఆయా కంపెనీల నుంచి ప్ర‌భుత్వం బ్యాంక్ గ్యారంటీల‌ను కోరుతోంది. కాగా, బ్యాంక్ గ్యారంటీపై ప్ర‌భుత్వం త‌మ‌ను ఒత్తిడి చేయ‌రాద‌ని కూడా టెస్లా కోరుతున్న‌ట్టు స‌మాచారం. 

మ‌రోవైపు టెస్లా భార‌త్ ఆప‌రేష‌న్స్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా మోడ‌ల్ 3, మోడ‌ల్ వై కార్ల‌ను లాంఛ్ చేస్తోంది. క‌న్సెష‌న‌ల్ ఇంపోర్ట్ డ్యూటీకి అనుమ‌తిస్తే భార‌త్‌లో మోడ‌ల్ 3, మోడ‌ల్ వై కార్లు వ‌రుస‌గా రూ. 38 ల‌క్ష‌లు, రూ. 43 ల‌క్ష‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.