విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయింపు

రాజధానిని విశాఖపట్నంకు తరలించే విషయంలో న్యాయసంబంధ చిక్కులు ఎదురవుతూ ఉండడంతో కొద్దిరోజుల పాటు మౌనంగా ఉంటూ వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తున్నది. విశాఖ నుంచి పాలన సాగించే దిశగా మరో అడుగు ముందుకేసింది.  రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను గుర్తించింది. భవనాల వినియోగంపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు.
మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు.  ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఎ, బి టవర్స్‌ను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. 

సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని నగరాన్ని విశాఖపట్నం తరలించాలనే ముఖ‌్యమంత్రి ఆలోచన 2019 డిసెంబర్‌లో తెరపైకి వచ్చింది.  విశాఖపట్టణంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడమే కాకుండా తాజాగా ఈ ఏడాది చివరి నుండి అక్కడి నుండే పరిపాలన సాగించబోతున్నట్లు కూడా ప్రకటించారు.

అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదనే తలంపుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య హేతుబద్ధమైన అభివృద్ధి కల్పించడానికి పరిపాలనా వ్యవహారాలను విశాఖపట్నం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. రాజధాని తరలింపు నిర్ణయం వెనుక కారణాలు ఏమున్నా,అన్ని ప్రాంతాలకు అమోదయోగ్యమైన అభివృద్ధి తమ నినాదమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని నిలిపి వేసింది.  దాదాపు లక్ష కోట్ల రుపాయలు ఖర్చయ్యే రాజధానిని ఒక ప్రాంతానికి కేంద్రీకృతం చేయడం తగదని వైసీపీ ప్రభుత్వం భావించింది.

కానీ కోర్టుల జోక్యంతో ప్రక్రియ ఆగిపోవటమే కాదు ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. అయితే ఎన్నికల సంవత్సరంలో ఈ విషయంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఉండేందుకు నివాసంతోపాటు క్యాంపు కార్యాలయాల ఎంపిక పూర్తి కావ‌డ‌మే కాకుండా అక్క‌డ నిర్మాణాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.