
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ పిల్ పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఈ పిల్ కు విచారణార్హత లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించినా హైకోర్టు మాత్రం నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలు కూడా ఏపీలో ఉన్నాయి. అయితే వీటి వెనుక ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాని, వాటిపై సీబీఐ విచారణ జరిపించి దోషుల్ని శిక్షించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీన్ని విచారించే విషయంలో ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం అభ్యంతరం తెలిపారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషన్ వేసిన తర్వాత కూడా ప్రభుత్వ అవినీతి అంటూ మీడియాలో రఘురామకృష్ణంరాజు మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు రఘురామ దాఖలు చేసిన పిల్ విచారించే అంశంపై ఆయన తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. రఘురామ పిల్ దాఖలు చేశారని తెలియగానే ప్రభుత్వం వీటికి సంబంధించిన రికార్డులు ధ్వంసం చేసిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
అనంతరం ఈ పిల్ పై విచారణను వచ్చే నెల 14కి వాయిదా వేసింది. ప్రతివాదుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపి విజయసాయి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పలువురు ఉన్నత అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఒక్కో శాఖలో అవినీతిపై విచారణ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నాలుగున్నరేళల్లో ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. సిఎం జగన్ తనకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఆరోపించారు. ఇసుక, మద్యం, ఆరోగ్య శాఖకు కొనుగోలు చేసిన కొన్ని పరికరాలు, సిమెంట్ కొనుగోలు వ్యవహారంలో బంధువులు, అనుకూలురుకు లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. వీటిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.
మరోవంక, సిఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతోందని, అందుకే హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ ఎంపి రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని, సిబిఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామ వేసిన బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ధర్మాసనం వెల్లడించింది.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!