`సంపన్న అభ్యర్థి’ వివేక్ నివాసాల్లో ఐటీ సోదాలు

`సంపన్న అభ్యర్థి’ వివేక్ నివాసాల్లో ఐటీ సోదాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరిలో సంపన్నుడైన మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి నివాసాలలో మంగళవారం ఆదాయపన్ను అధికారులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోదాలు జరపడం  కలకలం రేపుతోంది.  మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జి.వివేక్ ఇంట్లో తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
చెన్నూరులోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్‌ సోమాజిగూడలోని నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, కార్యాలయాలు, బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థిగా వివేక్ బరిలో నిలిచారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 610 కోట్లకుపైగా ఆస్తులను ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా తాను అప్పు ఇచ్చినట్లు వివేక్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇక చెన్నూరులో వివేక్ ధన ప్రలోభానికి తెరలేపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.  ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న వివేక్‌ కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల లావాదేవీలను గుర్తించి ఫ్రీజ్ చేశారు. గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

రూ.8కోట్ల నగదును ఫ్రీజ్ చేసి ఈసీ, ఐటీ, ఈడీ అధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులిచ్చిన సమాచారం ఆధారంగా వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  మరోవంక, డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అక్కడ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ దాడుల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు చెన్నూరులోని వివేక్ ఇంటికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతవారణం నెలకొంది. ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్, ఆ పార్టీ నేత పారిజాత నర్సింహ్మారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలతో పాటు బీఆర్ఎస్ మహేశ్వరం అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచురల నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మంత్రి సబితా అనుచరుల నివాసాల్లో భారీగా నగదును సీజ్ చేశారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్ల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా నగదును నిల్వ చేశారన్న సమాచారంతో ఐటీ అధికారులు దాడులు చేశారు.